‘రావణుడిగా యశ్ అదరగొట్టారు’.. రామాయణంపై రణ్‌బీర్ కపూర్ ప్రశంసలు

ప్రతిపక్షం, జూలై 27: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, కన్నడ స్టార్ యశ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. తాను ఎప్పటి నుంచో యశ్‌కు అభిమానినని చెప్పిన రణ్‌బీర్, ప్రతిష్ఠాత్మక ‘రామాయణ’ చిత్రంలో రావణుడి పాత్రలో ఆయన అద్భుతంగా నటించారని కొనియాడారు.

యశ్ తనదైన స్టైల్, స్వాగ్‌తో రావణుడి పాత్రలో పూర్తిగా ఒదిగిపోయారని, ఆ పాత్రను కేవలం పోషించడమే కాకుండా నిజంగా జీవించారని రణ్‌బీర్ వ్యాఖ్యానించారు. తెరపై ఆయన కనిపించే ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అన్నారు.

అలాగే సినిమాలో రాముడు, రావణుడు ఎదురెదురుగా వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తాయని పేర్కొన్నారు. తాను కూడా ఆ సన్నివేశాలను థియేటర్‌లో అభిమానులతో కలిసి చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.

భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ పురాణ ఇతిహాస చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో, యశ్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు. అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలను నెలకొల్పింది.

ఈ చిత్రం తొలి భాగాన్ని ఈ ఏడాది దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. విడుదలకు ముందే చిత్రంపై భారీ హైప్ నెలకొనగా, రాముడు–రావణుడు మధ్య పోరాట సన్నివేశాలు సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Spread the love

Related News

Latest News