[t4b-ticker]

సైరన్ మోగిస్తూ దూసుకెళ్లిన అంబులెన్స్.. చెక్ చేస్తే డ్రైవర్ మద్యం మత్తులో!

ప్రతిపక్షం, జూలై 30: హైదరాబాద్‌లో ప్రాణాలను కాపాడాల్సిన అత్యవసర అంబులెన్స్‌ డ్రైవర్ నిర్లక్ష్యం తీవ్ర కలకలం రేపింది. మద్యం మత్తులో అంబులెన్స్‌ను నడుపుతూ రోడ్డుపైకి వచ్చిన డ్రైవర్‌ను రాయదుర్గం పోలీసులు డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుకున్నారు. బ్రీత్ అనలైజర్ పరీక్షలో అతడు ఊహించని స్థాయిలో మద్యం సేవించినట్లు తేలడంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు.

రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని గచ్చిబౌలి ఆల్‌సబా హోటల్ సమీపంలో బుధవారం రాత్రి పోలీసులు ప్రత్యేక డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో సైరన్ మోగిస్తూ వేగంగా వస్తున్న రెడ్ అంబులెన్స్‌ను అనుమానంతో ఆపి డ్రైవర్‌కు పరీక్ష నిర్వహించారు. డ్రైవర్ రాఘవేంద్ర మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు బయటపడింది.

బ్రీత్ అనలైజర్ పరీక్షలో అతడికి 324 రీడింగ్ నమోదైంది. సాధారణంగా 30కు మించి రీడింగ్ వస్తేనే డ్రంకన్ డ్రైవ్ కేసు నమోదు చేస్తారు. అలాంటిది 324 రీడింగ్ నమోదు కావడంతో పోలీసులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ స్థాయి మద్యం మత్తులో అత్యవసర సేవల వాహనాన్ని నడపడం తీవ్ర నిర్లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.

అత్యవసర పరిస్థితుల్లో రోగులను సురక్షితంగా ఆసుపత్రులకు తరలించాల్సిన అంబులెన్స్ డ్రైవర్ ఈ విధంగా మద్యం సేవించి విధులు నిర్వర్తించడం ప్రజల్లో ఆందోళన కలిగించింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఎప్పుడైనా ఘోర ప్రమాదం జరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

మద్యం మత్తులో ఉన్న రాఘవేంద్రను అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతనిపై డ్రంకన్ డ్రైవ్ కేసు నమోదు చేశారు. అంబులెన్స్‌ను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అత్యవసర సేవలకు సంబంధించిన వాహనాలను నడిపే డ్రైవర్లు మరింత బాధ్యతతో వ్యవహరించాలని, ఇలాంటి నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని పోలీసులు హెచ్చరించారు.

Spread the love

Related News

Latest News