[t4b-ticker]

పరేడ్‌ గ్రౌండ్స్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు.. ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి

ప్రతిపక్షం, సెప్టెంబర్ 17: హైదరాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో విలీనమైన చారిత్రక రోజును పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. నాటి పోరాటాలు, త్యాగాలను స్మరించుకుంటూ వేడుకలు చేపట్టనున్నారు.

ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. తెలంగాణ గవర్నర్‌ శివ్‌ప్రతాప్‌ శుక్లా, కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొననున్నారు.

హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో విలీనమైన సెప్టెంబర్‌ 17వ తేదీకి చారిత్రక ప్రాధాన్యం ఉంది. నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో విలీనమైన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది వివిధ రాజకీయ పార్టీలు, సంస్థలు తమ తమ విధానాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న ఈ వేడుకల్లో తెలంగాణ విమోచన ఉద్యమానికి సంబంధించిన చారిత్రక అంశాలను గుర్తు చేసుకోనున్నారు. ఆ కాలంలో జరిగిన పోరాటాలు, ఉద్యమాల్లో పాల్గొన్నవారి సేవలను స్మరించుకోవడంతో పాటు త్యాగాలు చేసిన వారికి నివాళులు అర్పించనున్నారు.

సెప్టెంబర్‌ 17ను ఏ పేరుతో నిర్వహించాలనే అంశంపై తెలంగాణలో రాజకీయ పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్న నేపథ్యంలో పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రాధాన్యం ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ రోజును తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహిస్తోంది.

Spread the love

Related News

Latest News