జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్.
ప్రతిపక్షం, జగిత్యాల, ప్రతినిధి నవంబర్, 03: టిజిపిఎస్సి, ఆధ్వర్యంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ (సివిల్స్) పరీక్షను నవంబర్ 6,7, తేదీల్లో జేఎన్టీయూహెచ్ లో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు. ఈ పరీక్ష కంప్యూటర్ ఆధారిత విధానంలో (CBT) ఉదయం 10:00, గంటల నుంచి మధ్యాహ్నం 12:30, గంటల వరకు మధ్యాహ్నం 2:30, గంటల నుండి 5:00, గంటల వరకు రెండు షిఫ్టులో నిర్వహించబడుతుందని పేర్కొన్నారు.జగిత్యాల జిల్లాలోని జేఎన్టీయూహెచ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, నాచుపల్లి, కొండగట్టు, కొడిమ్యాల మండలంలో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్ష ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. పరీక్ష కేంద్రం వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతోపాటు, సైబర్ పోలీసుల ద్వారా సామాజిక మాధ్యమాల్లో తప్పుడు లేదా తప్పుదోవ పట్టించే సమాచార వ్యాప్తిని పర్యవేక్షించాలని సూచించారు. పరీక్ష సమయంలో నిరంతర విద్యుత్ సరఫరాతోపాటు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ విద్యుత్ ఏర్పాట్లను సిద్ధంగా ఉంచాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రంలో ప్రథమ చికిత్స, అత్యవసర వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలని వైద్యారోగ్య శాఖకు సూచించారు.
పరీక్ష కేంద్రం పరిసరాల్లో పారిశుధ్య నిర్వహణ చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్ష సమయంలో అంతరాయం లేని ఇంటర్నెట్ సదుపాయం కల్పించడంతోపాటు సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.సంబంధిత శాఖల అధికారులు పరీక్ష ఏర్పాట్లను వ్యక్తిగతంగా పరిశీలించి, ఏవైనా లోపాలు ఉంటే పరీక్ష ప్రారంభానికి ముందే సరిచేయాలని ఆదేశించారు. అభ్యర్థులు తమ హాల్టికెట్లో పేర్కొన్న సూచనలను తప్పనిసరిగా పాటిస్తూ, నిర్ణీత సమయానికి గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. పరీక్ష నిర్వహణకు అభ్యర్థులు, సహకరించాలని జిల్లా కలెక్టర్ కోరారు.

























