Trending Now

బీఆర్​ఎస్​కు ‘గుత్తా’ గుడ్​బై..?

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: బీఆర్​ఎస్​కు సీనియర్​ నేతలు ఒక్కొక్కరుగా గుడ్ బై చెబుతూ.. వస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పడు రాష్ట్ర పార్టీలో, అలాగే జిల్లాలలో ఒక రేంజ్​గా అధికారం చెలాయించుకున్న నేతలు సైతం పార్టీని విడిచిపెట్టడంతో ఆ పార్టీ రోజు రోజుకు సన్నగిల్లుతోంది. ఇప్పటికే పలువురు పార్టీని వీడగా, తాజాగా నల్గొండ జిల్లాకు చెందిన ముఖ్యనేతలు సైతం పార్టీని వీడనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేసేందుకు కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరపున పోటీ చేయాలని గుత్తా అమిత్ రెడ్డి భావించారు.

నల్లగొండ లేదా మునుగోడు నుంచి పోటీకి అవకాశం ఇస్తారని అనుకున్నారు.. కానీ ఆయనకు ఆ ఛాన్స్ రాలేదు. అయితే బీఆర్ఎస్ తరపున పార్లమెంట్ ఎన్నికల్లో అమిత్ రెడ్డి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. అయితే మంగళవారం అమిత్ రెడ్డి సీఎం రేవంత్ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని.. భువనగిరి నుంచి కాంగ్రెస్ తరపున సీటు ఆశిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని వర్గ పోరు కారణంగా అమిత్ రెడ్డి సీటు విషయంలో బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ఎటూ తేల్చడం లేదని.. అందుకే ఆయన కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారనే చర్చ జరుగుతోంది.

Spread the love

Related News