తిమ్మాపూర్‌ను కరువు మండలంగా ప్రకటించాలి

  • రైతులకు కరువు భృతి చెల్లించి ఆదుకోవాలి
  • బ్యాంకు రుణాలు పెంచాలి.. బియ్యం ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి: సిపిఐ డిమాండ్

ప్రతిపక్షం, మానకొండూర్, నవంబర్ 2: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొని రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున తిమ్మాపూర్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. రైతులకు కరువు భృతి అందించడంతో పాటు బ్యాంకు రుణాలను పెంచి ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎంపీడీవో డి.శ్రీనివాస్‌కు సిపిఐ తిమ్మాపూర్ మండల సమితి ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పొన్నగంటి కేదారి, మండల కార్యదర్శి బోయిని తిరుపతి ఈ వినతిపత్రాన్ని సమర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో వ్యవసాయ రంగం మరింత సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. నీటి వనరుల్లో నీటి లభ్యత తగ్గడంతో యాసంగి పంటలు సాగు చేయవద్దని ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో రైతుల జీవనోపాధిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. పంటలు సాగు చేయలేని పరిస్థితుల్లో రైతులకు ఆర్థిక భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తిమ్మాపూర్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులకు కరువు భృతి అందించాలని, బ్యాంకుల ద్వారా అదనపు రుణ సదుపాయం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

బియ్యం ధరల పెరుగుదలకు అడ్డుకట్ట వేయాలి

ఎల్‌నినో పరిస్థితులను ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు బియ్యం కృత్రిమ కొరత సృష్టిస్తూ ధరలను పెంచుతున్నారని నాయకులు ఆరోపించారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలతో ఇబ్బందులు పడుతున్న పేద, మధ్యతరగతి ప్రజలపై బియ్యం ధరల పెరుగుదల అదనపు భారంగా మారుతోందన్నారు. బియ్యం నిల్వలపై తనిఖీలు నిర్వహించి కృత్రిమ కొరత సృష్టించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే స్పందించాలని, కరువు పరిస్థితులపై సమగ్ర పరిశీలన జరిపి రైతులకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు సిపిఐ పోరాటం కొనసాగిస్తుందని, ప్రభుత్వం స్పందించని పక్షంలో రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల ప్రధాన కార్యదర్శి ఆవునూరి రమేష్, సిపిఐ నాయకులు గంగిపల్లి శంకర్, పార్నంది రాజకుమారులు తదితరులు పాల్గొన్నారు.

Related News

Latest News