పక్కవారి పెత్తనం ఇంకెన్నాళ్లు?
(ప్రతిపక్షం స్టేట్ బ్యూరో)
హైదరాబాద్, పిబ్రవరి 09: పెద్దపల్లి లోక్ సభ నియోజకవర్గం నుంచి ఈసారి స్థానికులనే పోటీకి దింపాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ అన్ని పార్టీల నుంచి స్థానికేతర అభ్యర్థులే పోటీకి దిగుతున్నారు. అర్హత, అనుభవం ఉన్నప్పటికీ ఇక్కడి అభ్యర్థులకు అవకాశం లభించడం లేదు. కారణాలు ఏవైనా దాదాపు అన్ని పార్టీలు బయటి అభ్యర్థులకే ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాయి. దీంతో స్థానికులకు అవకాశం దకడం లేదన్న అసంతృప్తి వ్యక్తం అవుతోంది. తెలంగాణ వచ్చాక రెండుసార్లు అధికారం చేపట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి కూడా బయటి అభ్యర్థులకే ప్రాధాన్యత ఇచ్చింది. కాంగ్రెస్ కూడా స్థానికేతర అభ్యర్థిని గతంలో రంగంలోకి సంఘంలోకి దించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ తెలుగుదేశం పార్టీ స్థానికేతర అభ్యర్థులను రంగంలోకి దించింది. విజయం సాధించినవారు ఎవరు కూడా ఈ నియోజకవర్గ మీద దృష్టి పెట్టలేదని, అభివృద్ధి మీద అంతగా శ్రద్ధ చూపలేదని విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా ఇది రిజర్వుడ్ నియోజకవర్గం కావడంతో ఆ సామాజిక వర్గంలోని ఒకే కులానికి చెందినవారికి అవకాశాలు లభిస్తున్నాయని కూడా విమర్శ ఉంది. ఇప్పటివరకు మాల, నేతకాని వర్గానికి చెందిన వారికి అవకాశాలు వచ్చాయి. మాదిగ అభ్యర్థులకు అవకాశాలు రాలేదు. దీనిని కూడా సరిదిద్దాలని ఆయా సామాజిక వర్గంలో అధిక జనాభా కలిగిన వారు కోరుతున్నారు.
రాజకీయ ఆటస్థలి
గతంలో ఇక్కడి నుంచి ఏ పార్టీ నుంచి అయినా ఈ నియోజకవర్గం మీద అంతగా శ్రద్ధ చూపలేదనే ఆవేదన ఈ ప్రాంతవాసులలో ఉంది. స్థానికులకే అవకాశం దక్కి వారే ఎంపీగా గెలుపొందితే ఇక్కడ అభివృద్ధి మీద ఎక్కువ దృష్టి పెడతారని స్థానికులు భావిస్తున్నారు. అందుకు తగినట్టుగా ఇక్కడ అర్హత అనుభవం కలిగిన అభ్యర్థులు కూడా దాదాపు అన్ని పార్టీలలో ఉన్నారు. గతంలో ఇక్కడి నుంచి టీఆర్ఎస్ ఎంపీగా గెలుపొందిన నేత ఇప్పుడు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన ఓ మహిళా నేత ఇంతకాలం విదేశాలలో ఉండి ఇప్పుడు మళ్లీ రంగ ప్రవేశం చేశారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ఈ లోక్ పభ స్థానం పరిధిలోని నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ అదే కుటుంబానికి చెందిన వ్యక్తికి ఎంపీ టికెట్ కాంగ్రెస్ నుంచి ఆశిస్తున్నట్టుగా సమాచారం. ఇంతకుముందు కూడా ఈ కుటుంబం నుంచి ఇద్దరు ఇక్కడ నుంచి ఎంపీలుగా ఎన్నికయ్యారు. ఒకరు కేంద్రమంత్రిగాను పనిచేశారు ఇంతవరకు బాగానే ఉంది. కానీ, ఆ తర్వాత వచ్చిన వారెవరు ఈ నియోజకవర్గ అభివృద్ధి మీద చూపలేదు. పైగా పెద్దపల్లి నియోజకవర్గం రాజకీయ ప్రయోగశాలగా, రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని ఆరోపణలు బలంగానే వినిపిస్తున్నాయి.
వీరెందకు ఎంపీలు కాకూడదు?
2009లో ఈ నియోజకవర్గానికి చెందిన ఆసంపల్లి శ్రీనివాస్ లాంటివారు ఆనాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏ పదవులు ఆశించకుండా నిస్వార్థంగా పార్టీకి సేవలు చేసుకుంటూ వచ్చారు. శ్రీనివాసే కాకుండా ఇంకా చాలామంది స్థానిక నేతలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు అండదండలు అందించినవారు ఉన్నారు. అలాంటి వారంతా ఇప్పుడు గుర్తింపును కోరుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో తమకు న్యాయం జరుగుతుందని విశ్వాసం వారందరిలో ఉంది. అయితే ఈసారి కూడా పరాన్నభుక్కులు అయిన కొందరు నేతలు ఈ స్థానంపై దృష్టి పెట్టి స్థానిక నేతల సేవలను మరుగున పెట్టి తాము అందలము ఎక్కాలని ఆలోచన చేయడాన్ని లోక్ సభ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ సామాన్య కార్యకర్తలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎలాగైనా ఈసారి స్థానికంగా ఉండి స్థానిక అభివృద్ధిని కాంక్షించే స్థానిక అభ్యర్థులకే కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలని వారంతా కోరుకుంటున్నారు. లేకపోతే ఎప్పటి ఎప్పటిలాగానే పెద్దపల్లి లోక్ సభ నియోజకవర్గం అనాథగా ఉండిపోతుందని చెబుతున్నారు. ఆసంపల్లి శ్రీనివాస్ లాంటి వారికి టిక్కెట్ ఇస్తే అధిక మెజార్టీతో గెలిపించుకుంటామని, సామాన్య కార్యకర్తలతో పాటు ద్వితీయ శ్రేణి నాయకులు కూడా చెబుతుండడం విశేషం. శ్రీనివాస్ కాకుండా స్థానిక నాయకులు ఎవరికీ ఇచ్చిన తాము అండగా ఉండి గెలిపించుకుంటామని, కాబట్టి నాయకులకు అవకాశం ఇవ్వద్దని ఇక్కడి ప్రజలు కూడా కోరుకుంటున్నారు.