ప్రతిపక్షం, జూలై 25: నిరసనలు చేపడుతున్న విద్యార్థుల ప్రధాన డిమాండ్ల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తప్పించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.
మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ, “విద్యార్థులకు మూడు ప్రధాన డిమాండ్లు ఉన్నాయి. వాటి విషయంలో వారు రాజీపడే పరిస్థితి లేదు. అవినీతి, అసమర్థతకు బాధ్యులైన విద్యాశాఖ మంత్రిని తప్పించాల్సిందే” అని అన్నారు.
ధర్మేంద్ర ప్రధాన్‌ను మరో శాఖకు బదిలీ చేసే అవకాశం ఉందనే ప్రచారంపై కూడా ఆయన స్పందించారు. “ఆయనను ఒక శాఖ నుంచి మరో శాఖకు మార్చడం ఆమోదయోగ్యం కాదు. ధర్మేంద్ర ప్రధాన్ అవినీతికి, విద్యార్థుల భవిష్యత్తు నాశనానికి ప్రతీకగా మారారు. కాబట్టి కేవలం శాఖ మార్చడం కాదు, పూర్తిగా మంత్రి పదవి నుంచి తొలగించాలి” అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
విద్యార్థుల డిమాండ్లకు న్యాయం జరిగే వరకు తమ పార్టీ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.

















