ప్రతిపక్షం, సెప్టెంబర్ 17: భారత్లో జననాల రేటు గణనీయంగా తగ్గుతోంది. దేశ మొత్తం సంతానోత్పత్తి రేటు 1.9కి పడిపోయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీర్ఘకాలంలో ఒక తరం జనాభాను మరో తరం భర్తీ చేసుకునేందుకు అవసరమైన 2.1 స్థాయి కంటే ఇది దిగువకు చేరింది. జనాభా పెరుగుదలలో చోటుచేసుకుంటున్న ఈ మార్పు భవిష్యత్లో దేశ జనాభా నిర్మాణంపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
సుమారు రెండు దశాబ్దాల క్రితం పరిస్థితులతో పోలిస్తే జననాల రేటులో భారీ మార్పు కనిపిస్తోంది. 2000 సంవత్సరంలో దేశ సంతానోత్పత్తి రేటు 3.3గా ఉండగా.. ప్రస్తుతం 1.9కి తగ్గింది. కుటుంబ పరిమాణంపై మారుతున్న ఆలోచనలు, వివాహాల వయసు పెరగడం, పట్టణీకరణ, విద్య, ఉపాధి వంటి అనేక సామాజిక, ఆర్థిక అంశాలు ఈ మార్పుకు కారణాలుగా పరిగణిస్తున్నారు.
దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ సంతానోత్పత్తి రేటు ఒకే విధంగా లేదు. బిహార్లో అత్యధికంగా 2.9గా నమోదైంది. ఉత్తరప్రదేశ్లో 2.6, మధ్యప్రదేశ్లో 2.4గా ఉంది. ఈ రాష్ట్రాల్లో జాతీయ సగటుతో పోలిస్తే సంతానోత్పత్తి రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ, గతంతో పోలిస్తే అక్కడ కూడా తగ్గుదల కనిపిస్తోంది.
దక్షిణాది రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటు మరింత తక్కువగా నమోదవుతోంది. ఆంధ్రప్రదేశ్లో 1.4గా ఉండగా, తెలంగాణలో 1.5గా నమోదైంది. చిన్న రాష్ట్రాల్లో సిక్కింలో అత్యల్పంగా 1.0గా ఉన్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. దీంతో రాష్ట్రాల మధ్య జనాభా వృద్ధి ధోరణుల్లో గణనీయమైన తేడాలు కనిపిస్తున్నాయి.
సంతానోత్పత్తి రేటు 2.1 కంటే దిగువకు పడిపోవడం వల్ల వెంటనే దేశ జనాభా తగ్గిపోతుందని అర్థం కాదు. జనాభా నిర్మాణంలో మార్పులు సాధారణంగా దీర్ఘకాలంలో స్పష్టంగా కనిపిస్తాయి. ప్రస్తుతం జనాభా వృద్ధి మందగించడం వల్ల భవిష్యత్లో వృద్ధుల సంఖ్య పెరగడం, పనిచేసే వయసు జనాభా వాటాలో మార్పులు రావడం వంటి అంశాలపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడుతోంది.
మరోవైపు తక్కువ జననాల కారణంగా భవిష్యత్లో కుటుంబాలు, ఉపాధి మార్కెట్, సామాజిక భద్రత, ఆరోగ్య సేవలు, వృద్ధుల సంరక్షణ వంటి రంగాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. జనాభా మార్పులకు అనుగుణంగా దీర్ఘకాలిక విధానాలను రూపొందించడం ప్రభుత్వాలకు కీలకంగా మారనుంది.





























