ఆప్షన్ పద్దతి –వెయిటింగ్ లిస్టు పద్దతి అమలు చేయాలని టీజీపీఎస్సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డితో చర్చలు
హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్ బ్యూరో: డైరెక్ట్ రిక్రూట్ మెంట్ కోటా క్రింద గ్రూప్-I సర్వీస్ లో 50 శాతం పోస్టులను ప్రతి ప్రభుత్వ శాఖ పూర్తిస్థాయిలో కరెక్టుగాలెక్కించి భర్తీ చేయాలని అలాగే గ్రూప్-2 సర్వీస్ లో 30 నుంచి 40 శాతం పోస్టులు లెక్కించుట భర్తీ చేయాలని రాజ్యసభ సభ్యులు, జాతీయ బి.సి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య, బి.సి నాయకులు టీజిపీఎస్సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డితో చర్చలు జరిపారు. కొత్త జిల్లాలకు పోస్టులు మంజూరు చేసి.. ఆప్షన్ పద్దతి–వెయిటింగ్ లిస్టు పద్దతి అమలు చేయాలని ఆర్. కృష్ణయ్య తెలిపారు. ఈ చర్చలలో గుజ్జ కృష్ణ, నీల వెంకటేష్, గోరిగే మల్లేష్ యాదవ్, వేముల రామకృష్ణ, వేముల రామకృష్ణ, కోట్ల శ్రీనివాస్,నందా గోపాల్,రాజ్ కుమార్ తదితరులు చర్చలు జరిపారు.
ముఖ్యమంత్రి ఒకే దఫా 2లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఆదేశాలు జారీ చేయడం గొప్ప విషయం. ప్రస్తుతం మీ దృష్టికి తీసుకువచ్చునది ఏమనగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కొందరు డైరెక్ట్ రిక్రూట్ మెంట్ కోటా క్రింద భర్తీ చేయవలిసిన గ్రూప్-1,2,3,,4 సర్వీస్ సరిగ్గా పూర్తి స్థాయిలో లెక్కించి – గణన చేసి భర్తీ చేయడానికి ప్రతిపాదనలు పంప లేదు. ఎదో నామమాత్రంగా లేక్కించి ప్రతిపాదనలు పంపారు. ఇప్పటికే అన్ని శాఖలలో అడ్ హక్ ప్రమోషన్ల పేరుమీద భర్తీ చేశారు. కొందరు ఉన్నతాదికారులు డైరెక్టు రిక్రూట్ మెంట్ లెక్కించడంలో అన్యాయం చేస్తున్నారు. డైరెక్టు రిక్రూట్ మెంట్ కోటా పోస్టులను ప్రమోషన్ల క్రింద భర్తీ చేశారు.
1) గ్రూప్-1 సర్వీస్ కింద గత 10 సంవత్సరాలుగా పోస్టుల భర్తీ చేయలేదు. అలాగే గ్రూప్-2 సర్వీస్ కింద 6 సంవత్సరాలుగా నోటిఫికేషన్ లేదు. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ లో పూర్తి స్థాయి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోట భర్తీ చేయకుండా నామమాత్రంగా భర్తీ చేశారు. అందుకే ఈ కింది అంశాలను పరిగణలోకి తీసుకొని డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా లెక్కించాలి.
2) గత 10 సంవత్సరాలుగా గ్రూప్-1 స్థాయి పోస్టులు, గ్రూప్-2 పోస్టులలో ఎంతమంది రిటైర్ అయ్యారు. ఎంతమందికి ప్రమోషన్లు ఇచ్చారు.
3) రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ 23 జిల్లాలోని వాటిలో 40 శాఖల జిల్లా ఆఫీసులు, తాలూకా ఆఫీసులు ఏర్పడ్డాయి. అలాగే 131 మండలాలు, 30 రెవెన్యూ డివిజినల్ ఆఫీసులు, 76 మున్సిపాలిటిలు, 7 మున్సిపల్ కార్పోరేషన్లు, 25 DSP ఆఫీసులు, 31 పోలీస్ సర్కిల్స్, 7 పోలిస్ కమిషనరేట్లు, 4,383 గ్రామపంచాయతీలు కొత్తగా ఏర్పడ్డాయి. ఇందులో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 సర్వీస్ పోస్టులు పెద్ద ఎత్తున ఏర్పడ్డాయి. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలకు, మండలాలకు మున్సిపాలిటీలకు పోస్టులు మంజూరు చేయలేదు. వీటికి పోస్టులు వెంటనే మంజూరు చేయాలి. ఇందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా లెక్కించాలి. వాటిలో గ్రూప్-I 50 శాతం, గ్రూప్-2 లో 30 నుంచి 40 శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కింద ఎన్ని పోస్టులు వస్తాయో పూర్తి స్థాయిలో లెక్కించి భర్తీ చేయాలి.
4) గ్రూప్-4 సర్వీస్ అంటే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు గత 25 సం.రాలుగా జిల్లా ఆఫీసులు, క్రింది స్థాయి ఆఫీసుల పోస్టులు భర్తీ చేయడం లేదు. కేవలం సచివాలయం, డైరెక్టరేట్ పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు. మిగతా జిల్లా – మండల స్థాయి జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ చేయడం లేదు. చాలా సంవత్సరాల తరువాత ఇటీవల జారీచేసిన గ్రూప్ – IV సర్వీస్ పోస్టులలో జిల్లా పోస్టులు కలిపారు. మొత్తం పోస్టులు తక్కువగా యున్నవి. కావున అన్నీ జిల్లాలలో యున్న ఖాళీలు లెక్కించి భర్తీ చేయాలి. ఇవన్నీ అంశాలను సమగ్రంగా పరిశీలించవలసిన ఆవశ్యకత ఉంది.
5) ప్రస్తుతం గ్రూప్-1 సర్వీస్ కింద 503 పోస్టులు ప్రకటించారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోట పోస్టులు కరెక్టుగా లెక్కిస్తే 1600కు పైగా వస్తాయి.
6) అలాగే గ్రూప్-2 సర్వీస్ కింద 783 పోస్టులు భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు. వీటిని కూడా కరెక్టు గా లెక్కిస్తే రెండు వేలకు పైగా వస్తాయి.
7) గ్రూప్ III పోస్టులు 1383 ప్రకటించారు వాస్తవంగా 3వేలకు పైగా యున్నాయి.
8) అలాగే గ్రూప్-4 సర్వీస్ కోటా కింద 8500 పోస్టులు ప్రకటించారు. ఇవి 25 వేలకు పైగా ఉంటాయి. ఒకసారి తమరు జోక్యం చేసుకుని డైరెక్ట్ రిక్రూట్ మెంట్ కోటా పోస్టులను కరెక్టుగా లెక్కించి భర్తీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
9) ఒకే దఫా గ్రూప్ 1-2-3-4, టీచర్, లెక్చరర్, ప్రొఫెసర్ల పోస్టులు భర్తీ చేస్తున్నందున మెరిట్ అభ్యర్థులు ఈ పోస్టులంన్నింటికీ సెలెక్ట్ అవుతారు. ఒక అభ్యర్ధి అన్ని రకాల 6 -7 కేటగిరీల పోస్టులకు ఒకేసారి సెలెక్ట్ అయితే ఆ అభ్యర్థి ఒకే పోస్టుల ఎంపిక చేసుకుంటారు. మిగతా 5 -6 రకాల పోస్టులు మిగిలిపోతాయి. ఇప్పుడున్న పద్దతి ప్రకారం ఇతర అభ్యర్థులకు రాకుండా పోతాయి. ఎందుకంటే వెయిటింగ్ లిస్టు పద్దతి లేదు. ఆప్షన్ పద్దతి లేదు. అందుకే ఆప్షన్ పద్ధతి మరియు వెయిటింగ్ లిస్టు కాల పరిమితి ప్రవేశపెట్టి పోస్టుల భర్తీ చేస్తే అందరికీ అవకాశం వస్తుంది. పోస్టులు మిగిలిపోకుండా భర్తీ అవుతాయి.
అలాగే టీచర్ పోస్టుల ఈ విషయంలో ప్రభుత్వ పాఠశాలల పోస్టులు, ఎస్సీ/ఎస్టీ/బీసీ/మైనారిటీ గురుకుల పాఠశాల పోస్టులు, ఆదర్శ పాఠశాల పోస్టులు కూడా వేరువేరుగా జరపడంతో మెరిట్ అభ్యర్థులు ఈ మూడు నాలుగు రకాల యాజమాన్యాల పాఠశాలలో మెరిట్ ఉన్న ఒకే అభ్యర్థి సెలెక్ట్ అవుతారు. ఒకే యాజమాన్యం పాఠశాల లో జాయిన్ అవుతారు. సెలెక్ట్ అయిన మిగతా మూడు వృధా అవుతాయి. అందుకే ఆప్షన్ పద్ధతి పెట్టడం, వెయిటింగ్ లిస్ట్ పెట్టడం, అన్ని ఫలితాలు ఒకేసారి ప్రకటించడం లాంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సుచిస్తున్నాము.
కొత్త తరాన్ని – యువతరాన్ని డైరెక్టు రిక్రూట్ మెంట్ ద్వారా ప్రభుత్వ యంత్రాంగంలోకి తీసుకువస్తే సమర్థవంతమైన, అవినీతికి తావులేని పాలన లభిస్తుంది. యువత శక్తి-యుక్తులు సమాజాభివ్రుద్దికి ఉపయోగించ వచ్చును. యువతను పాలనరంగం లోకి తీసుకువస్తే ఉత్సాహంతో, అంకిత భావంతో నిజాయితీగా పని చేస్తారు. కావున తమరు పై అంశాలను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. గుజ్జ కృష్ణ, నీల వెంకటేష్, మల్లేష్ యాదవ్, కోట్ల శ్రీనివాస్, నందగోపాల్, వేముల రామకృష్ణ, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.