*రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
*స్వయంగా తేమ శాతం పరీక్షించి ప్రారంభించిన ఎమ్మెల్యే.
*మునుగోడులో వానాకాలం ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
*ప్రతి గింజను ప్రభుత్వమే కొంటుందన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి.
ప్రతి పక్షం మునుగోడు నవంబర్ 02: మునుగోడు పట్టణంలోని చౌటుప్పల్ రోడ్ లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) మునుగోడు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వానాకాలం (ఖరీఫ్) ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గౌరవ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి PACS చైర్మన్, డైరెక్టర్లు, రైతులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే స్వయంగా తేమ శాతం పరీక్షించే మిషన్ లో ధాన్యాన్ని పోసి తేమ శాతాన్ని పరీక్షించారు. అనంతరం కాటాపై ధాన్యపు బస్తాను ఉంచి కొనుగోళ్లను లాంఛనంగా ప్రారంభించారు.
*రైతులతో, అధికారులతో ఆరా:
కొనుగోలు కేంద్రం వద్దకు ధాన్యం తీసుకువచ్చిన రైతులతో ఎమ్మెల్యే నేరుగా మాట్లాడారు. మునుగోడు మండల వ్యాప్తంగా ఈ వానాకాలంలో ఎన్ని ఎకరాల్లో వరి సాగు చేశారు, ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది, ఎల్ నినో ప్రభావం వల్ల దిగుబడి ఏమైనా తగ్గిందా, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఎంత, రైతులకు ప్రభుత్వం నుండి ఎంత ధర లభిస్తుంది, ప్రైవేట్ మార్కెట్ లో వ్యాపారులు ఎంత ధరకు కొనుగోలు చేస్తున్నారు, తేమ శాతం విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి తదితర వివరాలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు.
*రైతులకు భరోసా:
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. రైతులు దళారులను నమ్మి తక్కువ ధరకు అమ్ముకోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు.తేమ శాతం పేరుతో రైతులను ఇబ్బంది పెట్టవద్దని, కొనుగోలు కేంద్రంలో రైతులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని, తాను ఎల్లప్పుడూ రైతుల పక్షాన ఉంటానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో PACS చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.































