యూఏఈ పర్యటనలో ప్రధాని మోదీ
షేక్ సహాయం మరువలేనిది
ఈ బంధం భావితరాలకు ఆదర్శం
న్యూ ఢిల్లీ: విశాల హృదయం, విశ్వాసం, నమ్మకాలతోనే రెండు దేశాల మధ్య బంధాలకు బలమైన పునాది ఏర్పడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రెండు రోజుల యూఏఈ పర్యటన కోసం ఆయన మంగళవారం సాయంత్రం అబుదాబికి చేరుకున్నారు. ఈ సందర్భంగా యూఏఈ రాజు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ మోదీకి ఘన స్వాగతం పలికి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం యూఏఈ భద్రతా దళాలు ప్రధానికి సైనిక వందనం సమర్పిస్తూ స్వాగతం పలికాయి.
ప్రధాని ధన్యవాదాలు..
ఇరుదేశాల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో తొలుత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఖతర్ లో మందిర నిర్మాణం రాజు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ సహాయ సహకారాల వల్లే జరిగిందని ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. భారత విన్నపం మేరకు రాజు వెనక్కి తిరిగి చూసుకోలేదని, భారత్ కోరికను మన్నించడం ఆయన విశాల హృదయానికి నిదర్శనమని కొనియాడారు. ఇరుదేశాల మధ్య విశ్వాసం, అపార నమ్మకాలతో ముందుకు వెళుతున్నాయని కొనియాడారు. ఈ సహకారం భావితరాలకు ఆదర్శంగా నిలవాలని కోరారు.
యూఏఈ రావడం సొంత ఇంటి అనుభవం..
యూఏఈకి రావడం రాజు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ తో భేటీ కావడం తన స్వంత ఇంట్లో సోదరులతో కలిసిన అనుభవాన్ని ఇస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. తమ విన్నపం మేరకు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ గుజరాత్ లో నిర్వహించిన భారత్ వైబ్రెంట్ సదస్సుకు హజరై ప్రసంగించడాన్ని భారతీయులు ఎన్నటికీ మరిచిపోలేని అనుభవమని పేర్కొన్నారు.
యూఏఈలో ఆలయ నిర్మాణం
హిందూదేవాలయం ప్రారంభంలో యూఏఈ కృషి ఎనలేనిదని ప్రధాని కొనియాడారు. ఇక్కడ జరగనున్న తన సభకు భారతీయుల రాకకు ఎలాంటి ఆంక్షలు విధించకుండా పూర్తిగా సహాయ సహకారాలు అందించడాన్ని కూడా తాము హర్షిస్తున్నామని, రాజు సహకారం లేకుండా ఇదంతా సాధ్యపడేది కాదన్నారు. మోదీ రాక సందర్భంగా యూఏఈలో ఏర్పాటు చేసిన అహ్లాన్ మోదీ కార్యక్రమం అబుదాబిలోని జాయెద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో జరిగింది. ప్రధాని మోదీ గౌరవార్థం నిర్వహించిన కార్యక్రమాల్లో 700 మందికి పైగా సాంస్కృతిక కళాకారుల ప్రదర్శన నిర్వహించారు.
బంధం బలోపేతానికి భారత్ చర్యలు..
వ్యాపార, వాణిజ్య, ఇతర రంగాల్లో యూఏఈ భారత్ లది అవినాభావ సంబంధమని భవిష్యత్ లో ఈ బంధం బలోపేతానికి భారత్ చర్యలు తీసుకుంటుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ అధ్యక్షతన ద్వైపాక్షిక చర్చల సందర్భంగా తీసుకున్న పలు కీలక నిర్ణయాలు, ఒప్పందాలపై సంతకాలు చేశారు.