ప్రతిపక్షం, తెలంగాణ: నరేంద్రమోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మూడవసారి అధికారంలోకి రావడం ఖాయమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రచార రథాల ప్రారంభోత్సవ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘విజయ సంకల్ప యాత్ర’ పేరుతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో రేపటి నుండి రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో పర్యటిస్తామని.. రాబోయే ఎన్నికల్లో 17 సీట్లు గెలవడమే లక్ష్యంగా విజయ సంకల్ప యాత్ర చేస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలు భాగస్వామ్యం కావాలని.. విజయ సంకల్ప యాత్ర ఫిబ్రవరి 20వ తేదీన ప్రారంభమై మార్చి 2వ తేదీన ముగుస్తుందని పేర్కోన్నారు. అన్ని మండలాలు, నియోజకవర్గాల కేంద్రాలలో అన్ని సామాజికవర్గాల ప్రజలతో మమేకమవుతూ, రోడ్ షోలు నిర్వహించుకుంటూ యాత్ర కొనసాగుతుందన్నారు. త్రిపుల్ తలాక్ రద్దు తర్వాత ముస్లిం మహిళలు నరేంద్రమోదీ గారి నాయకత్వం కోరుకుంటున్నారని.. 17కు 17 సీట్లు గెలవడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించుకుంటామన్నారు.