ప్రతిపక్షం, ఏపీ: టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా ఇంకా సీట్ల విషయం కొలిక్కి రాకముందే ఉమ్మడి విశాఖ జిల్లా జనసేనలో అసంతృప్త జ్వాలలు రగులుకున్నాయి. ఈ క్రమంలో ఇవాళ జిల్లాలోని ముఖ్య నేతల సమావేశానికి నాగబాబు, పవన్ హాజరు కాగా మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ డుమ్మా కొట్టారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ నేరుగా కొణతాల ఇంటికి వెళ్లి, ఆయనతో మరో భేటీ అయ్యారు. అనకాపల్లి ఎంపీగా నాగబాబు పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలకు కొణతాల దూరంగా ఉంటూ వస్తున్నారు. రెండు సార్లు నాగబాబు అనకాపల్లి ఎంపీ నియోజకవర్గంలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశమైనా కొణతాల రామకృష్ణ పాల్గొనలేదు. రెండు రోజుల క్రితం కొణతాల ఇంటికి నాగబాబు వెళ్లారు. అనకాపల్లి అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని నాగబాబు కోరారు. కానీ, కొణతాల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో జనసేనాని పవన్ ఇవాళ మరోసారి కొణతాల ఇంటికి వెళ్లి ఆయనతో పలు విషయాలు చర్చించారు.