Trending Now

తప్పు జరిగితే చర్యలు తీసుకోండి: హరీష్‌రావు

హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్​ బ్యూరో: అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం మధ్య ప్రాజెక్ట్స్‌ ఫైట్‌ హీటెక్కింది. పోటా పోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉత్తర తెలంగాణకు కాంగ్రెస్, దక్షిణ తెలంగాణకు బీఆర్‌ఎస్‌ పార్టీల నేతలు వెళుతున్నారు. మేడిగడ్డ నిర్మాణ లోపాలు ఎత్తి చూపడానికి.. ‘ఛలో మేడిగడ్డ’కు కాంగ్రెస్ పిలుపివ్వగా.. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించవద్దని ‘చలో నల్గొండ’కు బీఆర్ఎస్ పిలుపిచ్చింది. ఈ క్రమంలో మంగళవారం అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన అనంతరం మీడియా పాయింట్ వద్ద మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. శాసన సభ జరిగిన.. జరుగుతున్న తీరును ఖండిస్తున్నాన్నారు. తమకు మైకులు ఇవ్వక పోవడం సభా సంప్రదాయాలకు విరుద్ధమన్నారు. ప్రజాస్వామ్య విలువలు మంట గలిపే విధంగా ప్రభుత్వం తీరు ఉందని విమర్శించారు.కాళేశ్వరం సమగ్ర స్వరూపం చాలా మందికి తెలియదని.. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటి కెనాల్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టిఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టిఎంసీల ఉపయోగం, వీటన్నింటి సమాహారం కాళేశ్వరం అని హరీష్‌రావు వివరించారు. ఒక బ్యారేజీలో ఒకటి రెండు కుంగి పోతే కోడి గుడ్డు మీద ఈకలు పీకుతున్నారని, మీరు వెళ్ళే దారిలో రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కుడెల్లి వాగు, పచ్చటి పొలాలు చూడాలని, కాళేశ్వరం ఫలితాలు రైతును అడగాలని సూచించారు.
ర్ణాటక నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చి రంగనాయక సాగర్ చూశారని, అద్బుతం అని మెచ్చుకున్నారని హరీష్‌రావు అన్నారు. చాప్రాల్ వైల్డ్ లైఫ్ ప్రాంతంలో ప్రాణహిత కట్టాలని చూస్తే అనేక అడ్డంకులు ఏర్పడ్డాయని, కేంద్రం, మహారాష్ట్ర, ఏపీలో నాడు కాంగ్రెస్ అధికారంలో ఉందని.. ఎందుకు ప్రాణహిత చేవెళ్ల కట్టలేదని ప్రశ్నించారు. మేము నీళ్ళు లేని స్థలం నుంచి నీళ్ళు ఉన్న దగ్గరకు మార్చి ప్రాజెక్టు కట్టి నీళ్ళు అందించామని.. మూడు కోట్ల మెట్రిక్ టన్నుల పంట పండింది అంటే ఆ జలాల వల్లేనని.. తప్పు జరిగితే చర్య తీసుకోవాలని.. పునరుద్ధరణ పనులు చేయాలన్నారు. దురుద్దేశంతో ప్రాజెక్ట్ పునరుద్దరణ చేయడం లేదని, అద్భుతంగా నిర్మించి నీల్లు ఇస్తున్నామన్నారు.
కాంగ్రెస్ హయాంలో పంజాగుట్ట ఫ్లై ఓవర్ కూలి 20 మంది చనిపోయారని, దేవాదుల పైపులు పేలి నీళ్ళు ఆకాశమంత ఎగిరాయని, అలాంటి ఘటనలు జరగటం బాధాకరమని హరీష్‌రావు అన్నారు. ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించ వద్దని మేము కాంగ్రెస్ నేతలకు నిద్ర లేపితే లేచారని, ఈరోజు బీఆర్ఎస్ సభ ఉందని.. దానిని డైవర్టు చేయడం కోసం కాంగ్రెస్ పోటీ కార్యక్రమం పెట్టిందని, దీనిని ప్రజలందరూ గమనిస్తున్నారని హరీష్‌రావు వ్యాఖ్యానించారు.

Spread the love

Related News

Latest News