ప్రకటించిన ప్రధాని మోడీ
తెలుగు నేతకు సమున్నత పురస్కారం
తెలుగు నేలకు అపూర్వ గౌరవం
చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్ కు కూడా
మాజీ ప్రధాని, తెలుగు తేజం పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రకటించింది. మరో మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్‌కు సైతం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ, బీహార్ మాజీ ముఖ్యమంత్రి, బీసీ నేత కర్పూరీ ఠాకూర్‌కు కూడా కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ యేడాది ఐదుగురికి భారతరత్న అవార్డులు ప్రకటించినట్టయ్యింది. సాధారణంగా యేడాదికి మూడు భారతరత్న అవార్డులు ఇస్తారు. ఈసారి ప్రభుత్వం ఐదుగురికి ప్రకటించడం విశేషం.
(ప్రతిపక్షం ప్రత్యేక ప్రతినిధి)
న్యూఢిల్లీ, పిబ్రవరి 09: పీవీ నరసింహారావు 21 జూన్ 1991 నుంచి 16 మే 1996 వరకు, చౌదరి చరణ్ సింగ్ 28 జూలై 1979 నుంచి 14 జనవరి 1980 వరకు దేశ ప్రధాన మంత్రులుగా సేవలు అందించారు. ఇక హరితవిప్లవ పితామహుడైన ఎంఎస్ స్వామినాథన్ దేశానికి ఎనలేని సేవలు అందించారు. న్యాయవాదిగా, విదేశీ వ్యవహారాల మంత్రిగా కూడా పనిచేశారు. పీవీ నరసింహారావు దేశానికి వివిధ హోదాలలో విస్తృతంగా సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, అనేక సంవత్సరాల పాటు పార్లమెంటు, శాసనసభ సభ్యునిగా చేసిన కృషిని ఆయనను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారు. దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో పీవీ దూరదృష్టి గల నాయకత్వం కీలకపాత్ర పోషించింది. బలమైన దేశంగా, అభివృద్ధికి బలమైన పునాది వేసింది. ప్రధానమంత్రిగా నరసింహారావు పదవీకాలం భారతదేశాన్ని ప్రపంచ మార్కెట్లకు అనుసంధానించిన ముఖ్యమైన చర్యలతో గుర్తించబడింది.. ఆర్థికాభివృద్ధిలో కొత్త శకాన్ని ప్రోత్సహిస్తుంది. ఇంకా, భారతదేశం విదేశాంగ విధానం, భాష, విద్యా రంగాలకు ఆయన అందించిన సహకారం భారతదేశాన్ని క్లిష్టమైన పరివర్తనల ద్వారా నడిపించడమే కాకుండా దాని సాంస్కృతిక మరియు మేధో వారసత్వాన్ని సుసంపన్నం చేసిన నాయకుడిగా అతని బహుముఖ వారసత్వాన్ని నొక్కి చెబుతుంది.
తెలుగు బిడ్డకు గౌరవం
తెలంగాణ బిడ్డ, తెలుగు ప్రజల గౌరవం మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర సన్మానం భారతరత్నను ప్రకటించడం ఆనందదాయకం. ఇది తెలుగు ప్రజలకు దక్కిన ఆదరం. పీవీకి భారతరత్న ఇవ్వాలని మేము గతంలోనే కాంగ్రెస్ పార్టీ పక్షాన , టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో నేను అనేకసార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం. ఇప్పుడా కోరిక నెరవేరినందుకు సంతోషంగా ఉంది.
–ఎ. రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి
ఇది సంతోషకరం
తెలంగాణ బిడ్డ, భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు దేశ అత్యన్నత పురస్కారం భారతరత్న ప్రకటించడం సంతోషకరం. ఇది తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవం. పీవీకి భారతరత్న ప్రకటించాలని బీఆర్ఎస్ పార్టీ చేసిన డిమాండును గౌరవించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఘనంగా పీవీ శతజయంతి ఉత్సవాలను నిర్వహించి గౌరవించింది.
– కె. చంద్రశేఖరరావు, మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత
ఇది దేశానికి శుభ సందర్భం
ఆర్థిక సంస్కరణవేత్త మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం దేశ ప్రజలందరికీ శుభ సందర్భం. ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు ఇది ఎంతో సంతోషకరమైన విషయం. నాన్నగారు ఈ దేశ అభ్యున్నతి కోసం అనేక రకాలుగా సేవలు అందించారు. ఆర్థిక వ్యవస్థను గట్టిపరిచారు. కొంత ఆలస్యమైనా కేంద్ర ప్రభుత్వం నాన్నగారిని గుర్తించడం ఆనందదాయకం. ఇందుకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు. –సురభి వాణీదేవి, ఎమ్మెల్సీ, పీవీ నరసింహారావు కూతురు