ప్రతిపక్షం, తెలంగాణ: షాద్ నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు మున్సిపాలిటీకి తలెత్తిన మిషన్ భగీరథ నీటి సరఫరా సమస్యను స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చొరవతో అధిగమించారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మిషన్ భగీరథ పనుల ఉదాసీనతపై సభలో స్పీకర్ దృష్టికి తెచ్చారు. గత కొంతకాలంగా కొత్తూరు మున్సిపాలిటీకి మిషన్ భగీరథ నీరు సరఫరా జరుగుతున్న అలసత్వంపై సభలో ప్రశ్నించారు. అయ్యప్ప టెంపుల్ వద్ద మిషన్ భగీరథ పైపుల లీకేజీ సమస్యల కారణంగా నీటి సరఫరా జరగడంలేదని దీనిని వెంటనే పునరుద్ధరించి కొత్తూరు మున్సిపాలిటీ ప్రజలకు మిషన్ భగీరథ నీరు అందించాలని సభ దృష్టికి తెచ్చారు. దీంతో స్పందించారు అధికారులు. సోమవారం మిషన్ భగీరథ అధికారి సందీప్ ఆధ్వర్యంలో మరమ్మత్తురు చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. మరమ్మత్తు పనులు ప్రారంభం అయ్యాయని మరో మూడు రోజుల్లో కొత్తూరు మున్సిపాలిటీకి మిషన్ భగీరథ నీరు విడుదల అవుతాయని పేర్కొన్నారు. సోమవారం మరమత్తు పనులను ఎమ్మెల్యే శంకర్ స్వయంగా పరిశీలించారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా నీరు అందే విధంగా అధికారులు ప్రయత్నించాలని ఎమ్మెల్యే శంకర్ ఆదేశించారు.