ప్రతిపక్షం, సిద్దిపేట, ఏప్రిల్ 23: ప్రభుత్వ అనుమతి లేకుండా డంప్ చేసిన 10 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సిద్దిపేట టాస్క్ ఫోర్స్, సిద్దిపేట 2 టౌన్ పోలీసులు సీజ్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ రోడ్డు మార్కెట్ వద్ద గల కొర్తివాడ శ్రీనివాస్ షాపులో అనుమతి లేకుండా డంప్ చేసినట్లు నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి తనిఖీ నిర్వహించారు. ఈమేరకు నిల్వ ఉంచిన 10 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్ చేయడంతో పాటుగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక, పీడీఎస్ రైస్ అక్రమ రవాణా చేసినా, నిల్వ ఉంచినా చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూదం, గ్యాంబ్లింగ్ చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఎవరైనా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే సిద్దిపేట టాస్క్ ఫోర్స్ అధికారుల నెంబర్లు 8712667445, 8712667446, 8712667447 లకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.