Trending Now

ఉత్సాహంగా సాగిన 2కే రన్..

ప్రతిపక్షం, హైదరాబాద్, ఏప్రిల్10: ఓటును మించిన ఆయుధం లేదని, ప్రతి ఓటరు తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు స్వీప్ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం శేర్లింగంపల్లి జోన్ కొండాపూర్ బొటానికల్ గార్డెన్స్ నుండి హైటెక్స్ రోడ్ మెటల్ చార్మినార్ వరకు ‘ఐ ఓట్ ఫర్ షూర్’ అనే నినాదంతో నిర్వహించిన 2కే రన్ ఉత్సాహంగా సాగింది. కొండాపూర్ బొటానికల్ గార్డెన్స్ నుండి ప్రారంభమైన 2కె రన్ ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో అతి కీలకమైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని, స్వేచ్ఛయుతంగా నైతిక ఓటింగ్ వేయాలని సూచించారు. రాష్ట్రంలో 3.30 కోట్ల ఓటర్లు ఉన్నారని, ఎన్నికలలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనట్లైతే ఓటు వృధా అవుతుందన్నారు. ఒక వ్యక్తికి దేశంలో ఎక్కడైనా ఒకచోట మాత్రమే ఓటు ఉండాలన్నారు.

హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ.. బుల్లెట్ కన్నా బ్యాలెట్ పవర్ గొప్పదని, మనం వేసే ఓటు మన భవిష్యత్తును నిర్దేశిస్తుందన్నారు. హైదరాబాద్ నగరం అన్నింటా ముందున్నా, ఓటింగ్ శాతం లో 50 శాతం మించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణ ప్రాంతమైనప్పటికీ, అందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నప్పటికీ, ఓటు వేయడంలో నిరాసక్తత చూపుతున్నారన్నారు. ఓటర్ జాబితాలో తమ పేరు ఉన్నది లేనిది చెక్ చేసుకోవాలని, లేనట్లయితే ఈ నెల 15 లోగా ఫారం – 6 లో దరఖాస్తు చేసుకుని ఓటు హక్కు పొందాలన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ.. శేర్లింగంపల్లి పెద్ద నియోజక వర్గమని, ఏడు లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారని, ఆదాయం, చదువులో మాత్రమే కాదు, సామాజిక బాధ్యతలో కూడా ముందున్నామని నిరూపించుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాలలో అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామన్నారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు ఓటు వేసేలా ఇంటిలో, ఆఫీసులలో, బంధువులు, స్నేహితుల వద్ద ఓటు వేయడం పై అవగాహన కల్పించి అందరూ ఓటేసేలా చైతన్యం పర్చాలని కోరారు. అనంతరం అందరితో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. 2 కే రన్ లో టాప్ గా వచ్చిన 5 గురికి మెమొంటోలు అందజేసారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి అదనపు కలెక్టర్ ప్రతిభా సింగ్, శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ స్నేహ శబరీష్, ఏసీపీ డిప్యూటీ కమిషనర్ లు అయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News