హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్ బ్యూరో: తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలను విద్యాశాఖ 28 రోజుల్లోనే విడుదకా చేసి రికార్డ్ నమోదు చేసుకుంది. మంగళవారం ఉదయం బషీర్‌బాగ్‌లోని ఎస్‌సీఈఆర్‌టీలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశంతో పాటు విద్యాశాఖ అధికారులు ఎస్‌ఎస్‌సీ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 91.31 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఈసారి కూడా బాలికలదే పై చేయిగా నిలిచారు. బాలికలు 93.23 ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 89.42శాతం ఉత్తీర్ణత పొందారు. విద్యార్దులు ఎవరు ఆందోళన చెందవద్దని ఫెయిల్ అయిన విద్యార్థులు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు రాసుకోవచ్చని బుర్ర వెంకటేశం అన్నారు.
హై లైట్స్..
*గతంతో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం బాగా పెరిగింది
*ఫలితాల్లో మొదటి స్థానంలో నిర్మల్ జిల్లా. 99.05%
*చివరి స్థానంలో వికారాబాద్ జిల్లా 91.31 శాతం
*27వ స్థానంలో మేడ్చల్ జిల్లా
*30వ స్థానంలో హైదరాబాద్ జిల్లా
*3927 స్కూల్స్‌లో వంద శాతం ఉత్తీర్ణత
*ఆరు ప్రైవేటు పాఠశాలల్లో సున్నా శాతం ఉత్తీర్ణత
*జిల్లా పరిషత్ గవర్నమెంట్ పాఠశాలల్లో 91.31 శాతం ఉత్తీర్ణత
*తెలంగాణ గురుకులాలలో 98.71 శాతం ఉత్తీర్ణత
జూన్ 3 నుంచి అడ్వాన్స్ పరీక్షలు..
జూన్ 3 నుంచి జూన్ 13వ తేదీ వరకు అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించబోతున్నట్లు బుర్ర వెంకటేశం తెలిపారు.ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు జరుగుతాయి. మార్కులపై విద్యార్థులకు డౌట్స్ ఉంటే రీ వాల్యూయేషన్, రీ వెరిఫికేషన్ కోసం 15 రోజుల పాటు దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపారు.
28 రోజుల్లోనే ఫలితాలు వెల్లడి..
మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు జరిగాయి. కేవలం 28 రోజుల్లోనే ఫలితాలు వెల్లడించడం పై విద్యార్థుల తల్లీతండ్రులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 5లక్షల 8వేల 385 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 4 లక్షల 94 వేల 207 మంది.. ప్రైవేట్ గా 11606 మంది హాజరయ్యారు. వీరిలో బాలురు 2,7,952 మంది, బాలికలు 2,50,433 మంది పరీక్షలు రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.