HYDRA Commissioner Ranganath: హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాల కూల్చివేతలో హైడ్రా దూకుడుగా వెళ్తుంది. చెరువులను కబ్జా చేసి అక్రమంగా నిర్మించిన భవనం, కట్టడం ఎవరిదనే విషయాన్ని పట్టించుకోకుండా దూసుకెళ్తోంది. ఈ విధంగా హైడ్రా చర్యల వివాదంలో నిలుస్తున్న తరుణంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడారు. రాజకీయాల్లో హైడ్రా పావుగా మారదని తెలిపారు. ఓవైసీ, మల్లారెడ్డి అనేది చూడమని, విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచిస్తామన్నారు. అయితే విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా వారికి కొంత సమయం ఇస్తామన్నారు.
చెరువులను ఆక్రమించి కళాశాల భవనాలు కట్టడం వాళ్ల తప్పే అయి ఉండొచ్చని, కానీ ఎఫ్‌టీఎల్ అనేది ఇక్కడ ముఖ్యమైన విషయమన్నారు. ధర్మసత్రమైన ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉంటే కూల్చేస్తామన్నారు. పార్టీలకు అతీతంగా అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్నామన్నారు. హైడ్రా నోటీసులు ఇవ్వదని, కూల్చడమేనని రంగనాథ్ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ప్రభుత్వం భద్రత పెంచింది. హైదరాబాద్ మధురానగర్‌లోని ఆయన ఇంటి వద్ద ఔట్ పోస్ట్ ఏర్పాటు చేసింది.