Trending Now

CM Revanth Reddy: మిలియన్ మార్చ్ తరహాలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ

CM Revanth Reddy Bhoomi Puja for Telangana Thalli Statue: సచివాలయం తెలంగాణ పరిపాలనకు గుండెకాయ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు బుధవారం ఉదయం 11గంటలకు సీఎం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు భూమి పూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించాలనుకున్నామని, కానీ వేదపండితులు దసరా వరకు మంచి రోజులు లేవని చెప్పారన్నారు. అందుకే ముందుగా నిర్ణయించిన మేరకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కేరళ పర్యటనలో ఉన్నారని, మిగతా మంత్రులు సైతం వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారన్నారు.

సంకల్పం, పట్టుదల ఉంటే సాధ్యం కానిది లేదని తెలంగాణ ఉద్యమకారులు నిరూపించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 60ఏళ్ల తెలంగాణ ఆకాంక్షను సోనియాగాంధీ నెరవేర్చారని గుర్తుచేశారు. 2014 నుంచి 2024 వరకు పదేళ్ల పాలనలో గత పాలకులు ఎన్నో నిర్మాణాలు నిర్మించామని గొప్పలు చెప్పుకున్నారన్నారు. కానీ తెలంగాణ తల్లిని తెరమరుగు చేసే ప్రయత్నం చేశారని సీఎం మండిపడ్డారు. గత పాలకులు నేను తెలంగాణ, తెలంగాణ నేను అనేలా వ్యవహరించారని విమర్శలు చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో అలాంటి విధానాలకు విరుద్ధమన్నారు. ప్రగతి భవన్ పేరిట గడీలు నిర్మించుకొని భారీ కంచెలు, పోలీసు పహారాతో ప్రజలను లోపలికి రాకుండా అడ్డుకున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతి భవన్‌ను ప్రజా భవన్‌గా మార్చి దేశానికి ఆదర్శంగా నిలిచామన్నారు. ప్రజా భవన్ వద్దకు వచ్చి ప్రజలు సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు.

పదేళ్లలో దాదాపు రూ.22.50 లక్షల కోట్లు ఖర్చు పెట్టిన గత ప్రభుత్వం..తెలంగాణ తల్లి విగ్రహానికి రూ.కోటి కూడా ఖర్చు చేసేందుకు ముందుకు రాలేదని సీఎం మండిపడ్డారు. దేశం, రాష్ట్రం కోసం పోరాడిన ఎంతో మంది విగ్రహాలు ఉన్నాయని, దేశం కోసం ప్రాణాలర్పించిన రాజీవ్ గాంధీ విగ్రహం లేదన్నారు. ఆయన విగ్రహం పెడితే తెలంగాణ తల్లి విగ్రహంతో ముడిపెట్టి వివాదం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని జూన 2న తాను చెప్పానని సీఎం అన్నారు. దొరల గడీల ఆనవాళ్లు లేకుండా..తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న విధంగా తెలంగాణ ప్రజల అభిమతానికి తగినట్లు తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించే బాధ్యతను జేఎన్టీయే ఫైన్ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్‌కు అప్పగించామని సీఎం తెలిపారు.

డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని, అదేరోజు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ జన్మదినోత్సవ ఉందన్నారు. ఈ మేరకు డిసెంబర్ 9న తెలంగాణ ప్రజలకు పండగ రోజు అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన మిలియన్ మార్చ్ తరహాలో లక్షలాది మంది తెలంగాణ బిడ్డల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామన్నారు. ఇది అరుదైన అవకాశమని, ఇలాంటి అవకాశం అందరికీ రాదన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం అదృష్టమన్నారు. కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News