BRS MLC Kavitha to reach Hyderabad: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్‌లో హైదరాబాద్ చేరుకున్నారు. కేటీఆర్, భర్త అనిల్, కుటుంబ సభ్యులతో కలిసి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న కవితకు గులాబీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ మేరకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆమెపై పూలవర్షం కురిపించారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులకు. అభిమానులకు కవిత అభివాదం చేశారు. జై తెలంగాణ అంటూ నినదించగా.. కార్యకర్తలు సైతం జై తెలంగాణ నినాదాలతో చెప్పడంతో విమానాశ్రయం దద్దరిల్లింది.
శంషాబాద్ నుంచి బంజారాహిల్స్ లోని తన నివాసానికి భారీ ర్యాలీగా వెళ్లనున్నారు. ఇప్పటికే కవితను కలిసేందుకు ఆమె తల్లి శోభ..కవిత ఇంటికి చేరుకున్నారు. అయితే రాత్రి వరకు తన ఇంటికి చేరుకొని ఆమె తల్లిని కలవనున్నారు. అనంతరం రేపు మధ్యాహ్నం ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు వెళ్లి అక్కడ కేసీఆర్‌ను కలవనున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15న అరెస్ట్ అయిన కవితకు ఆగస్టు 27న సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాదాపు 166 రోజుల పాటు కవిత తీహార్ జైలులో ఉన్నారు. పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నించినా విఫలమయ్యాయి. కాగా, నిన్న రాత్రి 9 గంటల తర్వాత ఆమెను తీహార్ జైలు నుంచి విడుదల చేశారు. అయితే ఈడీ, సీబీఐ కేసుల్లో రూ.10లక్షల విలువైన షూరిటీలను సమర్పించాలని, పాస్ పోర్టు కూడా అధికారులకు అప్పగించాలని, అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది.