మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న పలు రకాల పరిస్థితుల గురించి జస్టిస్ హేమ కమిటీ నివేదిక సిద్ధం చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ రిపోర్టులో పలు షాకింగ్ విషయాలు బహిర్గతం అయ్యాయి. ఇది భారత సినీ పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ రిపోర్టుపై పలువురు సినీనటులు స్పందిస్తున్నారు. దీనిపై తాజాగా హీరోయిన్ సమంత కూడా స్పందించారు. కమిటీ పనితీరును సమంత ప్రశంసించారు. ‘వుమెన్ ఇన్ సినిమా కలెక్టివ్’ (డబ్ల్యూసీసీ) నిర్ణయం వల్లే ఈ కమిటీ నివేదిక సిద్ధం చేయగలిగిందని తెలిపారు. పరిశ్రమలో మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించడం కోసం డబ్ల్యూసీసీ అవిశ్రాంతంగా కృషి చేస్తోందని కొనియాడారు.
ఇక, హేమ కమిటీ నివేదిక తీవ్ర దుమారం కొనసాగుతున్న వేళ ప్రముఖ నటుడు మోహన్‌లాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (AMMA) అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు 17 మంది సభ్యులున్న మొత్తం పాలక మండలి పదవుల నుంచి వైదొలిగింది. కమిటీలో కొంత మంది సభ్యులపై లైంగిక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మోహన్ లాల్ ఈ నిర్ణయం తీసుకున్నారు.