ఐదు నెలల పాటు జైలు జీవితం గడిపి బెయిల్‌పై విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ఇవాళ సిద్ధిపేట జిల్లా ఎర్రవెల్లిలోని మాజీ సీఎం, తన తండ్రి కేసీఆర్ నివాసానికి వెళ్లారు. భర్త, కుమారునితో కలిసి వచ్చిన ఆడబిడ్డకు కేసీఆర్ పుట్టినింటిలో ఆత్మీయ ఆహ్వానం అందించారు. కన్న బిడ్డను చూడగానే కేసీఆర్ భావోద్వేగానికి గురైయ్యారు. కుమార్తెను ఆప్యాయంగా అక్కున చేర్చుకుని కేసీఆర్ ఆశీర్వదించారు.
ఎమ్మెల్సీ కవిత 10 రోజులపాటు ఎర్రవల్లి ఫాంహౌస్‌లోనే ఉండనున్నారు. తనను కలిసేందుకు ఎవరూ రావొద్దని, పది రోజుల తర్వాత తానే కార్యకర్తలందరితో సమావేశం అవుతానని కవిత రిక్వెస్ట్ చేశారు. కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఈడీ, సీబీఐ కేసులో కవితకు ఆగస్టు 27న సుప్రీం కోర్టు బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆగస్ట్ 28 ఆమె హైదరాబాద్‌కు వచ్చారు. బంజారాహిల్స్‌లోని తన నివాసంలో తల్లి శోభమ్మను ఆలింగనం చేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. అదే సమయంలో తన సోదరుడు కేటీఆర్‌కు కవిత రాఖీ కట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె.. రానున్న 15 రోజుల్లో తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. న్యాయం గెలిచిందని, తన పోరాటం ఇంకా కొనసాగుతుందని అన్నారు.