రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీని అధిగమించి గౌతమ్ అదానీ దేశంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. 2024 హూరన్ ఇండియా రిచ్ లిస్టులో గౌతమ్ అదానీ అతడి కుటుంబం మొత్తం ఆస్తుల విలువ రూ. 11.6 లక్షల కోట్లుగా ఉంది. గతేడాది అన్ని అదానీ గ్రూపు కంపెనీల షేర్ల ధరలలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. కొత్త పోర్టులు, కంటైనర్ టెర్మినల్స్ కొనుగోలు కారణంగా అదానీ పోర్ట్స్ 98 శాతం పెరుగుదలను చూసింది. అదానీ ఎనర్జీ, అదానీ గ్యాస్, అదానీ ట్రాన్స్‌మిషన్ మరియు అదానీ పవర్-షేరు ధరలో సగటున 76% వృద్ధిని సాధించింది. MSCI తన ఆగస్టు 2024 సమీక్షలో అదానీ గ్రూప్ సెక్యూరిటీలపై పరిమితులను ఎత్తివేయాలని నిర్ణయించడంతో సాధారణ ఆపరేషన్స్ సాధ్యమయ్యాయి.
ఇక, 10.14 లక్షల కోట్ల సంపదతో అంబానీ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో అదానీ, అంబానీ తర్వాత హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అధినేత శివనాడార్ అతని కుటుంబం రూ. 3.14 లక్షల కోట్ల సంపదతో మూడో స్థానంలో ఉన్నారు. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత సైరస్ ఎస్ పూనావాలా(2.89 లక్షల కోట్లు) 4వ స్థానంలో, సన్ ఫార్మా అధినేత దిలీప్ సింఘ్వీ (2.39 లక్షల కోట్లు)తో 5వ స్థానంలో ఉన్నారు.