కేపీసీసీ అధ్యక్షుడు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు భారీ ఊరట లభించింది. ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో విచారణను కొనసాగించే విషయంపై దాఖలైన పిటిషన్లను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీకే శివకుమార్ విచారణను కొనసాగించాలంటూ న్యాయస్థానంలో రెండు పిటిషన్లలు దాఖలు అయ్యాయి. ఒకదాన్ని సీబీఐ దాఖలు చేయగా.. మరొకటి బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ దాఖలు చేశారు. అయితే, వీటిని తాజాగా పరిశీలించిన న్యాయస్థానం విచారణను కొసాగించేందుకు వీలు లేదంటూ రెండు పిటిషన్లను కొట్టివేసింది.
కోర్టు తీర్పుపై స్పందించిన డీకే.. ‘అక్రమాస్తుల కేసులో కోర్టు నిర్ణయాన్ని దేవుడి నిర్ణయంగా భావిస్తా. నేను కోర్టు తీర్పు, దేవుణ్ణి నమ్ముతాను’ అని అన్నారు. కాగా.. 2013-18 మధ్య డీకే శివకుమార్ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన సంపాదనలో రూ.74 కోట్లు లెక్కకు మించిన ఆదాయం ఉందని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆయన నివాసం, ఆఫీసుల్లో ఐటీ శాఖ సోదాలు జరిపి కొంత మొత్తాన్ని స్వాధీనం చేసుకుంది. అనంతరం ఈ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ దర్యాప్తు చేపట్టింది. ఈడీ విచారణ ఆధారంగా 2020లో సీబీఐ ఆయనపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.