బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలతో పలు జిల్లాల్లో జనజీవనం స్తంభించిపోయింది. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఫైజాన్ అహ్మద్, ఆర్డీఓ రత్నా కళ్యాణితో కలిసి ఆమె పట్టణంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటించారు.
జీఎన్ఆర్ కాలనీ, సిద్దాపూర్, అస్రా కాలనీ, సోఫీ నగర్, వైయస్సార్ కాలనీ, కురన్నపేట్, ప్రియదర్శిని నగర్ తదితర ప్రాంతాలలో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. స్వర్ణ వాగును సందర్శించిన కలెక్టర్.. నదికి వచ్చే వరద నీటి వల్ల ఎలాంటి అనర్ధాలు జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. కాలనీ వాసులు కూడా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కలెక్టర్ వెంట నిర్మల్ అర్బన్ తహశీల్దార్ రాజు, ఆర్ఐలు వెంకటరమణ, షేక్ మొయినుద్దీన్, నిర్మల్ మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు. మరోవైపు, భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని అధికారులు రద్దు చేశారు.