DCM Drown In River in Nirmal: రాష్ట్ర వ్యాప్తంగా వర్షం దంచి కొడుతోంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపై వరద నీరు చేరుతోంది. నదులు, చెరువులు ఉప్పొంగిపోతున్నాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది.
కాగా, నిర్మల్ జిల్లాలో స్వర్ణ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ తరుణంలో ఆదివారం సాయంత్రం నిర్మల్ బైంసా ప్రధాన రహదారిపై ప్రయాణిస్తున్న ఓ డీసీఎం నదిలోకి దూసుకెళ్లింది. వేగంగా వస్తున్న డీసీఎం..ఒక్కసారిగా అదుపుతప్పి నదిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన జరిగిన సమయంలో డీసీఎంలో నలుగురు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఇద్దరు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా.. మరో ఇద్దరు నీటిలో చిక్కుకున్నారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. నిర్మల్ డీఎస్పీ అల్లూరి గంగారెడ్డి, రూరల్ సీఐ రామకృష్ణ, అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి తాళ్ల సహాయంతో ఆ ఇద్దరిని బయటకు తీశారు. అనంతరం నిర్మల్ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గత రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు స్వర్ణ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. దీంతో గేట్లను ఎత్తివేయడంతో నది ప్రవాహం ఎక్కువగా పారుతోంది. ఈ నేపథ్యంలోనే నిర్మల్ బైంసా ప్రధాన రహదారిపై ఉన్న స్వర్ణ నది వంతెన పై నుంచి ప్రమాదవశాత్తు డీసీఎం నదిలోకి దూసుకెళ్లింది. డీసీఎం నీటిలో మునిగిపోవడంతో జాలర్లు గాలింపు చర్యలు చేపట్టారు.