ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బస్తర్ డివిజన్‌లో మంగళవారం భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మృతుల సంఖ్య పెరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో మొత్తం 15 మంది మావోయిస్టులు మృతి చెందనట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. సంఘటనా స్థలం నుంచి పోలీసులు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. బీజాపూర్-దంతెవాడ జిల్లాల సరిహద్దు బైరాంగఢ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశం ఏర్పాటు చేశారనే పక్కా సమాచారంతో భద్రతా బలగాలు ఉదయం ఏడు గంటల సమయంలో అక్కడికి చేరుకున్నాయి. పోలీసుల రాకను గుర్తించిన మావోయిస్టులు కాల్పులకు దిగడంతో పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. దాదాపు నాలుగు గంటల పాటు కాల్పులు జరిగిన అనంతరం ఘటనా స్థలంలో 15 మంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు.
ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని, ఘటనా స్థలంలో సెర్చ్ ఆపరేషన్ కూడా కొనసాగుతోందని బస్తర్ డివిజన్ ఐజీ సుందర్ రాజ్, దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ వెల్లడించారు. ఆపరేషన్లో పాల్గొన్న జవాన్లంతా సురక్షితంగా ఉన్నారని తెలిపారు. ఆపరేషన్ పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని వివరించారు. ఛత్తీస్‌గఢ్ అడవులలో గత కొంతకాలంగా మావోయిస్టుల ఏరివేత సాగుతున్న విషయం తెలిసిందే. గత నెల 29న బస్తర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పులలో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. నారాయణపూర్ జిల్లాలోని అబుజ్మద్ ప్రాంతంలో మావోయిస్టు నేతలు ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో గాలింపు చర్యలు చేపట్టినపుడు ఈ సంఘటన జరిగింది.