Central Relief to AP -Telangana: భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ఏపీ, తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం భారీ సాయం అందించింది. రెండు రాష్ట్రాలకు కలిపి రూ. 3,300 కోట్లు నిధులు విడుదల చేసింది. తక్షణ సహాయ చర్యలు కోసం ఈ నిధులు కేటాయించాలని చెప్పింది. వరదలతో ఏర్పడిన నష్టాల వివరాలు తెలుసుకునేందుకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలుగు రాష్ట్రాల్లో పర్యటించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా, తెలుగు రాష్ట్రాల్లో సహాయ చర్యలపై కేంద్రం ఎక్స్ ద్వారా వివరాలు వెల్లడించింది. ప్రధాని ఆదేశాల మేరకు ఏపీ, తెలంగాణకు పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర హోంశాఖ తెలిపింది. వరద ప్రాంతాలకు ఇప్పటికే నిపుణుల బృందం పంపామని, వరదలు, డ్యామ్‌లు, వాటి భద్రతను కేంద్ర బృందం పరిశీలిస్తుందని చెప్పింది. వరద నష్టం అంచనాకు ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ ఏర్పాటు చేశామని పేర్కొంది. ఏపీలో 26 ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, 8 వైమానిక హెలికాప్టర్లు ఉన్నాయని, ఏపీలో 3 నౌకాదళ హెలికాప్టర్లు, డోర్నియల్ ఎయిర్‌క్రాఫ్ట్ ఉన్నాయని హోంశాఖ పేర్కొంది.