CM Chandrababu Naidu On Budameru: బుడమేరు గండ్లు పూడ్చాలని ఆదేశాలు ఇచ్చినట్లు, తొలుత గండ్లు పూడ్చటమే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలపై శుక్రవారం విజయవాడ కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడారు. వరద ముంపు ప్రాంతాల్లో నీరు తగ్గుతుందని, 72 శాతం పారిశుద్ధ్య పనులు పూర్తి చేశామన్నారు. వరద ప్రాంతాల్లో బాధితుల కోసం ఉచిత బస్సులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా వరదలతో 28 మంది చనిపోయారని సీఎం చెప్పారు. ఇళ్ల సామగ్రి నష్టంపై ఆలోచిస్తున్నామన్నారు. కేంద్రానికి ప్రాథమిక నివేదికలే పంపలేదని, తెలుగు రాష్ట్రాలకు కేంద్ర సాయంపై ఇంకా సమాచారం లేదన్నారు. వరద నష్టం అంచనాపై రేపు ఉదయం ప్రాథమిక నివేదిక పంపుతామన్నారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన చేపట్టామన్నారు.