Encounter jammu kashmir in Udhampur: జమ్మూ కశ్మీర్‌లో భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఉధంపూర్ జిల్లాలో బుధవారం భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో సైన్యం, పోలీసుల ప్రత్యేక బృందం ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఉధంపూర్, కథువా జిల్లాల్లోని అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో ఆర్మీకి చెందిన పారా మిలటరీ, 22 గర్హ్వాల్ రైఫిల్స్, కేంద్రపాలిత ప్రాంత పోలీసులకు ప్రత్యేక ఆపరేషన్ గ్రూప్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.
బసంత్ గఢ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైన్టలు వెల్లడించారు. ఉగ్రవాదులు సిబ్బందిపై కాల్పులు జరిపారని, భద్రతా దళాలు సైతం తిరిగి ఎదురు కాల్పులు చేయడంతో ముగ్గురు ఉగ్రవాదులను వారి రహస్య స్థావరంలో మట్టుబెట్టారు. ప్రస్తుతం ఎన్ కౌంటర్ కొనసాగుతోంది. భారీ వర్షాలు, క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు ఉన్నా ఉగ్రవాదులను ఏరివేయడంలో భద్రతా బలగాలు విజయం సాధించాయి. ఘటనాస్థలంలో అదనపు బలగాలు మొహరించాయి.