KTR severe criticism: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ ప్రజలపై కక్ష కట్టారని, ‘హైడ్రా’ పేరుతో నగరంలోని ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడంతో, ఇప్పుడు వారిపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ పేదల ఇళ్లను సైతం కూల్చివేస్తున్నారని విమర్శించారు.
ఇక, ఫిరాయింపులపై మాట్లాడే నైతిక బాధ్యత రేవంత్‌కు లేదన్నారు. ‘ఫిరాయింపులపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేలా ఉంది. పార్టీ మారిన వారు దమ్ముంటే రాజీనామా చేయాలి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఉరి తీయాలని గతంలో సీఎం అన్నారు. పార్టీ మారాను అని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే బహిరంగంగా ప్రకటించారు. అలాంటి ఎమ్మెల్యేకు పీఏసీ ఛైర్మన్ పదవి ఇచ్చారు. అరెకపూడి గాంధీ ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని కోరితే దాడి చేశారు. కౌశిక్ రెడ్డి కుటుంబానికి ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిది? హైదరాబాద్‌లో కనీసం శాంతి భద్రతలు అదుపులో ఉంచలేకపోతున్నారు. గూండాలకు పోలీసు ఎస్కార్ట్ ఇచ్చి కౌశిక్‌రెడ్డిపై దాడికి పంపారు. హైడ్రా అని హైడ్రామాలు చేస్తున్నారు’ అని మండిపడ్డారు.