Jani Master Sexually Assaulting Case: టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీబాషాపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది. మైనర్‌గా ఉన్నప్పటి నుంచే జానీ తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా, జానీ మాస్టర్ ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. మొత్తం నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి జానీ మాస్టర్ కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆయనను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయితే ప్రస్తుతం జానీ లడఖ్‌కు పారిపోయినట్లు తెలుస్తోంది.
2017లో జానీ మాస్టర్ పరిచయం కావడంతో 2019లో ఆయనకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేరానని బాధితురాలు పేర్కొంది. ముంబయిలో ఓ సినిమా షూటింగ్ కోసం వెళ్లగా.. ఓ హోటల్లో జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడని, ఈ విషయం ఎవరికైనా చెబితే పని నుంచి తొలగిస్తానని బెదిరించారని ఆరోపించింది. ఇలా పలుమార్లు అత్యాచారానికి పాల్పడడంతోపాటు షూటింగ్ సమయంలోనూ అసభ్యంగా ప్రవర్తించేవాడని చెప్పింది. వేధింపులు తట్టుకోలేక బయటకొస్తే.. బయట కూడా ఇబ్బందులు పెడుతున్నట్లు ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది.