UN Condemns Lebanon Device Blasts: ఇజ్రాయెల్ హెజ్‌బొల్లాను టార్గెట్ చేసుకుంది. ఇందులో భాగంగానే పేజర్లు, వాకీటాకీల పేలుళ్లతో లెబనాన్ అట్టుడికించింది. ఇజ్రాయిల్-హెజ్‌బొల్లా దాడుల నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ దాడులు అంతర్జాతీయ చట్టానికి వ్యతిరేకమని, దీన్ని యుద్ధ నేరంగా పరిగణించవచ్చని పేర్కొంది. హానిచేయని పోర్టబుల్ వస్తువుల్లో ట్రాప్ పరికరాలు వాడటం సరికాదని మానవహక్కుల హైకమిషనర్ వోల్కర్ టర్క్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి వెల్లడించారు. ఇదంతా ఉద్దేశపూర్వకమైన హింసకు పాల్పడటం యుద్ధం కిందికే వస్తుందన్నారు. ఈ దాడుల్లో సాధారణ పౌరులు తీవ్ర భయాందోళనకు గురయ్యారని చెప్పారు. ఇదిలా ఉండగా, హెజ్‌బొల్లాలో పరికరాల పేలుళ్ల ఘటనపై స్పందించేందుకు యూఎన్‌లోని ఇజ్రాయెల్ రాయబారి డానీ డానన్ నిరాకరించారు. కానీ, లెబానాన్‌లోని హెజ్‌బొల్లాతో యుద్ధం చేయాలనే ఉద్దేశం తమకు లేదన్నారు. ఈ దాడులను కొనసాగించలేమని డానన్ పేర్కొన్నారు.