Trending Now

కమ్యూనిస్టు కోటలో కాషాయ జెండాలు రెపరెపలు..

ప్రతిపక్షం, కరీంనగర్: కమ్యూనిస్టు కోటలో కాషాయ జెండాలు రెపరెపలాడాయి. ఎర్ర జెండాలు, గులాబీ జెండాలు, మూడు రంగాల జెండాలకే మొన్నటి వరకు పరిమితమైన హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రజాహిత మలిదశ యాత్ర సందర్భంగా ఇంటింటా కాషాయ జెండాలు వెలిశాయి. ఎక్కడ చూసినా కమలం పువ్వును చూసి మలిదశ ప్రజాహిత యాత్రలో భాగంగా తొలిరోజు కోహెడలో ప్రారంభమైన బండి సంజయ్ యాత్ర ఇందుర్తి, చినముల్కనూరు, చిగురుమామిడి, బొమ్మెనపల్లి వరకు మొత్తం 10 గ్రామాల్లో సాగింది. ఆయా గ్రామాల్లో బండి సంజయ్ పాదయాత్ర చేస్తూ ప్రజలను కలుసుకున్నారు.

సంజయ్ వస్తున్నారని తెలిసి రోడ్డుకు ఇరువైపులా వేచి ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ.. దుకాణాలు, చిరు వ్యాపారులు, మహిళలు, యువకులు సహా చిన్న పిల్లలను సైతం స్వయంగా కలుసుకుని నవ్వుతూ పలకరిస్తూ ముందుకు సాగారు. సంజయ్ వస్తున్నాడని తెలిసి వివిధ గ్రామాల ప్రజలు ఇళ్ల ముందు వేచి చూసి.. ఆయన రాగానే కరచాలనం చేశారు. భారత్ మాతా కీ జై.. జై శ్రీరామ్.. ఔర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అంటూ యువత నినాదాలు చేశారు. కోహెడలో బండి సంజయ్ ప్రసంగానికి మంచి స్పందన లభించగా ఇందుర్తిలో జనం పొటెత్తారు. దారి పొడవునా ప్రజలు సంజయ్ వెంట పాదయాత్ర చేశారు. మరోవైపు ప్రజాహిత యాత్రలో భాగంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల తీరును బండి సంజయ్ ఎండగట్టారు. హుస్నాబాద్ నియోజకవర్గంతో పాటు కోహెడ, చిగురుమామిడి మండలాలతోపాటు నియోజకవర్గ పరిధిలో గ్రామాల వారీగా కేంద్రం ఇచ్చిన నిధులను ప్రజలకు అర్థమయ్యే రీతిలో సంజయ్ వివరించారు.

Spread the love

Related News

Latest News