Jagan wrote a letter to Prime Minister Modi: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారం ఏపీ వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగానూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైసీపీ పాలనలో పరమ పవిత్రమైన తిరుమల లడ్డూను అపవిత్రం చేశారని కూటమి ప్రభుత్వం.. చంద్రబాబుకు పాలన చేతకాక డైవర్షన్ రాజకీయాలకు తెర లేపుతున్నారని వైసీపీ శ్రేణులు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇక ఈ వ్యవహారంలో తాజాగా మరో కీలక పరిణామం జరిగింది. ఈ వ్యవహారంలో నిజాలు నిగ్గు తేల్చాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పవిత్రతను దెబ్బతీసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని ఈ లేఖలో ఆరోపించారు. ఏపీలో జరుగుతున్న దౌర్భాగ్య ఘటనలపై దృష్టి సారించేందుకు ఈ లేఖ రాస్తున్నానని, తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత, సమగ్రత, ప్రతిష్టకు కోలుకోలేని నష్టం వాటిల్లిందని ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. వేంకటేశ్వరుడికి భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది హిందూ భక్తులు ఉన్నారని, ఈ సున్నితమైన పరిస్థితిని జాగ్రత్తగా నిర్వహించకపోతే, ఈ అబద్ధం చాలా హాని కలిగిస్తుందని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. టీటీడీ పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పచ్చి అబద్ధాలు ప్రచారం చేశారని వైఎస్ జగన్ మండిపడ్డారు.