‘Lapata Ladies’ selected for Oscar: బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మాజీ సతీమణి కిరణ్ రావు తెరకెక్కించిన ‘లాపతా లేడీస్’ మన దేశం తరఫున 2025 ఆస్కార్ నామినేషన్లకు ఎంపికైన విషయం తెలిసిందే. దీంతో ఈ మూవీపై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన ప్రతిభారత్న దీనిపై స్పందించారు. ఓ ఇంగ్లిష్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ‘ఎంతో ఆనందంగా ఉంది. మాటలు రావడం లేదు. మేము ఈ చిత్రం ఆస్కార్‌కు మన దేశం నుంచి ఎంపికవ్వాలని ఎంతో కోరుకున్నాం. మా ఆశలు నిజమయ్యాయి. మా కష్టానికి ఫలితం దక్కింది. ఒక లక్ష్యాన్ని పెట్టుకొని పని చేస్తూ పోతే ఫలితాలు వాటంతట అవే వస్తాయి. ప్రస్తుతం నా విషయంలో ఇదే జరుగుతోంది. నేను ఊహించిన దానికంటే రెట్టింపు ఆనందాన్ని చూడగలుగుతున్నా’ అని అన్నారు.