Jagan’s visit to Tirumala: తిరుమల లడ్డూ వివాదం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. ఇక, ఈ వివాదంపై వైసీపీ కూడా స్పీడ్ పెంచేసింది. అధికార పార్టీ నాయకులపై ఎదురు దాడికి దిగింది. ఈ క్రమంలోనే ఈ శనివారం (సెప్టెంబర్ 28) రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని తమ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది వైసీపీ. అంతేకాదు, రేపు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరుమలకు వెళ్లనున్నట్లు ప్రకటించారు. కాలి నడకన ఆయన తిరుమల చేరుకోనున్నారు. 28న శ్రీవారిని దర్శించుకోనున్నారు. జగన్ పర్యటనను వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నారు. తిరుమల ప్రసాదంపై వివాదం తలెత్తిన నేపథ్యంలో జగన్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకోనుంది. అయితే, తిరుమలలో జగన్ డిక్లరేషన్‌పై సంతకం చేసిన తర్వాతే దర్శనం చేసుకోవాలనే డిమాండ్ కూటమి నేతల నుంచి వస్తోంది. ఇదే ఇప్పుడు ఉద్రిక్తతకు దారి తీస్తోంది. జగన్ పర్యటనను అడ్డుకుంటామని ఉమ్మడి చిత్తూరు జిల్లా టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. దీంతో రేపు తిరుమలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే సూచనలు కనిపిస్తుండటంతో పోలీసు బలగాలు అప్రమత్తమయ్యాయి.