Cabinet approves 78-day bonus to Railway employees: రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 78 రోజుల వేతనాన్ని బోనస్ రూపంలో చెల్లించడానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే రైల్వే ఉద్యోగులకు బోనస్ అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో 11.72 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు రూ.2,028.57 కోట్ల మొత్తం పీఎల్‌బీగా అందనుందని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ట్రాక్ మెయింటెనర్లు, లోకోపైలట్లు, గార్డులు, స్టేషన్ మాస్టర్లు, సూపర్వైజర్లు, టెక్నీషియన్లు, పాయింట్స్‌మేన్, మినిస్టీరియల్ సిబ్బందికి 78 రోజులకు గానూ రూ.17,951 బోనస్ లభిస్తుందని చెప్పారు. పనితీరును మెరుగుపరిచేలా ఉద్యోగులను ప్రోత్సహించడానికి బోనస్ చెల్లింపు ఉపయోగపడుతుందన్నారు.