Pawan Kalyan demands board for protection of ‘Sanatana Dharma’: సనాతన ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించే వ్యక్తిగా.. వారాహి డిక్లరేషన్‌ను వేంకటేశ్వరుని పాదాల సాక్షిగా ప్రకటిస్తున్నానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తిరుపతిలో జ్వోతిరావు పూలే కూడలిలో నిర్వహించిన వారాహి డిక్లరేషన్ సభలో ఆయన ప్రసంగించారు. సనాతన ధర్మ పరిరక్షణకు చట్టం తేవాలన్నారు. ఏ మతానికి, ఏ ధర్మానికి భంగం వాటిల్లినా.. ఒకేలా స్పందించేలా లౌకిక వాదాన్ని పాటించాలన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ, విశ్వాసాలకు భంగం కలిగించే చర్యలను అరికట్టడానికి దేశం మొత్తం అమలయ్యేలా బలమైన చట్టాన్ని తక్షణమే తేవాలని కోరారు. ఈ చట్టాన్ని అమలు చేసేలా జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు కావాలని, వానికి ఏటా నిధులు కేటాయించాలని పేర్కొన్నారు. అలాగే ఆలయాల్లో నిత్య నైవేద్యాలు, ప్రసాదాల్లో వినియోగించే వస్తువుల స్వచ్ఛతను ధ్రువీకరించే విధానం తీసుకురావాలన్నారు. ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగానే కాకుండా విద్య, కళ, ఆర్థిక, పర్యావరణ పరిరక్షణ, సంక్షేమ కేంద్రాలుగా రూపుదిద్దుకోవాలని, ఆ దిశగా ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పారు.