AP Flood Victims Compensation: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లడంతో వరదలకు దారితీశాయి. రాష్ట్రంలో వచ్చిన వరదల్లో నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం సాయం అందించింది. అయితే, ఇప్పటికే వరదల్లో సర్వం కోల్పోయన బాధితుల్లో దాదాపు 98శాతం మందికి ఆర్థిక సాయం అందించినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. సాంకేతిక కారణాలతో పరిహారం అందని వరద నష్ట బాధితులకు సోమవారం వారి ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు రూ.584కోట్లు ప్రభుత్వం జమ చేయగా.. మరో రూ.18కోట్లు అందించాల్సి ఉంది. వరదల్లో తీవ్రంగా నష్టపోయిన వారిలో 21,768 మంది బాధితులు తమ బ్యాంకు ఖాతాలను తప్పుగా నమోదు చేసినట్లు అధికారులు గుర్తించారు. మొత్తం వీరి ఖాతాల్లో రూ.18.69 కోట్లను డీబీటీ పద్ధతిలో నగదు జమ చేయనున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో 15వేల కుటుంబాలు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 4,620 కుటుంబాలు, ఇతర జిల్లాల్లోని పలువురు బాధితులకు నిధులు పంపిణీ చేయనున్నారు.