Ireland beat South Africa: అబుదాబి వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో ఐర్లాండ్ ఘన విజయం సాధించింది. ఆఖరి వన్డేలో దక్షిణాఫ్రికాపై 69 పరుగుల తేడాతో ఐర్లాండ్ గెలిచింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2-1తో కైవసం చేసుకుంది. తొలి రెండు వన్డేల్లో దక్షిణాఫ్రికా గెలుపొందగా.. ఆఖరి వన్డేలో ఐర్లాండ్ ఆల్‌రౌండ్ షోతో సత్తాచాటింది. వన్డే ఫార్మాట్‌లో దక్షిణాఫ్రికా సేనను ఓవరాల్‌గా రెండోసారి మట్టికరిపించింది. దీంతో ఐర్లాండ్‌ను క్రికెట్ ఫ్యాన్స్ అభినందిస్తున్నారు.
తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ (88; 92 బంతుల్లో, 8 ఫోర్లు, 3 సిక్సర్లు), హ్యారీ టెక్టర్ (60; 48 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్సర్) సత్తాచాటారు. బాల్బిర్నీ (45; 73 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్సర్), క్యాంపర్ (34; 36 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్సర్) పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో విలియమ్స్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. బార్ట్‌మన్, ఫెలుక్వాయో చెరో రెండు వికెట్లు తీశారు.
అనంతరం లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా తడబడింది. 10 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత 79 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. దీంతో 46.1 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌటైంది. జేసన్ స్మిత్ (91; 93 బంతుల్లో, 9 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. ఇక, ఐర్లాండ్ బౌలర్లలో క్రెయిగ్, గ్రాహమ్ చెరో మూడు వికెట్లు తీయగా.. మార్క్ అడైర్ రెండు వికెట్లు పడగొట్టాడు.