ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు తెల్లవారుజామున నాలుగు గంటలకు కన్నుమూశారు. కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. కోట మరణ వార్త తో టాలీవుడ్ లో విషాదం నెలకొంది. క్యారెక్టర్ నటుడిగా, విలన్ గా, విలక్షణ నటుడిగా కోట శ్రీనివాసరావు పేరు తెచ్చుకున్నారు. 1999 నుంచి 2004 వరకు విజయవాడ ఎమ్మెల్యే గాను పనిచేశారు. ప్రతిఘటన సినిమా ఎంతగానో పేరు తీసుకొచ్చింది. తన విలక్షణ నటనకు
గాను కోట ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. భారత ప్రభుత్వం పద్మశ్రీతోను కోట శ్రీనివాసరావును గౌరవించింది. వందలాది సినిమాలలో నటించిన కోట శ్రీనివాసరావుకు అనేకమంది అభిమానులు కూడా ఉన్నారు. ఏ భాషనైనా, యాసనైనా అవలీలగా పలకగల కోట శ్రీనివాసరావు టాలీవుడ్లో ఉన్నత స్థాయి నటుడిగా ఎదిగారు ఆయన మరణం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరనిలోటని పలువురు నివాళులు అర్పిస్తున్నారు.
తెలుగు సినిమా పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరొందిన కోట శ్రీనివాసరావు 750కి పైగా చిత్రాలలో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. 1978లో ‘ప్రాణం ఖరీదు’ చిత్రంతో తెలుగు సినిమాలో అడుగుపెట్టిన ఆయన, ‘ప్రతిఘటన’ సినిమాతో ఒక్కసారిగా స్టార్‌డమ్ సాధించారు, ఈ చిత్రంలో తన తెలంగాణ యాసలో చెప్పిన డైలాగులు ఆయన కెరీర్‌ను శిఖరాగ్రంలో నిలిపాయి. ‘అహ నా పెళ్ళంట’లో లక్ష్మీపతి పాత్రలో పిసినారిగా, ‘గబ్బర్ సింగ్’లో శ్రుతిహాసన్ తండ్రిగా, ‘రాఖి’, ‘బృందావనం’లలో తాతగా వైవిధ్యమైన నటనతో మెప్పించారు. విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆయన నటనకు ఐదు నంది అవార్డులు, 2015లో పద్మశ్రీ పురస్కారం లభించాయి. వయోభారం, అనారోగ్య కారణాలతో ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, అవకాశం వస్తే నటిస్తానని ఆయన ఉత్సాహంగా చెబుతున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ చిత్రాలలోనూ నటించిన కోట, తన నటనతో నవరసాలను పండించి, తెలుగు సినిమాకు చెరగని ముద్ర వేశారు.సినీ ప్రియుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన కోట శ్రీనివాసరావు నటనా ప్రతిభ అజరామరం!