ప్రతిపక్షం, హైదరాబాద్:
జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కిపు ప్రక్రియ యూసఫ్ గూడ అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో జరుగుతోంది. అయితే ఎన్నికల అధికారులు చేసిన ఏర్పాట్లలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కౌంటింగ్ హాల్లో పరిస్థితులు ఇరుకుగా ఉన్నాయని ఏజెంట్లు చెబుతున్నారు. టేబుల్ టేబుల్ కి కూడా సరైన గ్యాప్ లేకుండా ఇరుకైన ఏర్పాట్లు చేసినట్టు చెబుతున్నారు. ఇదిలా ఉంటే కౌంటింగ్ హాల్ బయట పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారు. ఎన్నికల కమిషన్ పాసులు జారీ చేసిన మీడియా ప్రతినిధులను కూడా పోలీసులు కౌంటింగ్ హాల్లోకి అనుమతించడం లేదు. వెస్ట్ జోన్ డీసీపీ ఆదేశాల ప్రకారం మీడియాను లోపలికి అనుమతించేది లేదంటూ పోలీసులుచెబుతున్నారు. దీంతో మీడియా ప్రతినిధులు కౌంటింగ్ హాల్ బయటే ఎదురు చూస్తూ ఏజెంట్లు ఇచ్చిన సమాచారంతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. కనీసం ఎన్నికల అధికారులు కూడా రౌండ్ రౌండ్‌కు అధికారికంగా ప్రకటన చేయకపోవడంతో అంతా గందరగోళం నెలకొంది. ఇదిలా ఉండగా పోలీసుల తీరుపై మీడియా ప్రతినిధులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ పాసులు జారీ చేసినా పోలీసులు అనుమతించకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒక దశలో పోలీసులు ఎన్నికల అధికారులను కూడా డిక్టేట్ చేస్తుండడం విస్మయానికి గురి చేస్తోంది.




























