Trending Now

గంజాయి బ్యాచ్‌కు చుక్కలే

తెలంగాణలో ‘నయా’ టెక్నాలజీ
‘యూరిన్ టెస్ట్ కిట్ల’ వినియోగం
ఇప్పటికే కొన్ని చోట్ల వినియోగం

ఇక రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు సన్నాహాలు

ప్రతిపక్షం బ్యూరో, కరీంనగర్, నవంబర్ 17: తెలంగాణలో గంజాయి దందాను అరికట్టేందుకు ప్రభుత్వం, పోలీసు శాఖ కొత్త వ్యూహంతో ముందుకు దూసుకెళ్లాయి. గంజాయి సరఫరాదారులతో పాటు దానిని వినియోగించే వారిని కూడా గుర్తించేందుకు మొదటిసారిగా ‘యూరిన్ టెస్ట్ కిట్ల’ వినియోగాన్ని ప్రారంభించాయి. వ్యక్తి గంజాయి సేవించాడా లేదా అన్నది స్పాట్‌లోనే నిర్ధారించే వీలున్న ఈ పరికరాలను ఇప్పటికే కొన్ని ముఖ్యమైన కమిషనరేట్లలో ప్రవేశపెట్టారు. కరీంనగర్, రామగుండం, సిద్దిపేట, నిజామాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చిన పోలీసులు, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల కీలక పోలీస్ స్టేషన్లకు ఈ కిట్లను ప్రభుత్వమే అందజేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇదే విధానాన్ని అమలు చేసే దిశగా అధికార యంత్రాంగం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తుల మూత్ర నమూనాలను ఈ కిట్లతో పరీక్షిస్తున్నారు. పరీక్షలో పాజిటివ్‌గా తేలితే, గంజాయి సేవించినట్లు నిర్ధారించి కేసులు నమోదు చేయడంతో పాటు, వారిని మత్తు వ్యసనం నుంచి బయటపడేలా పునరావాస కేంద్రాలకు పంపే చర్యలు కూడా చేపడుతున్నారు. మరింత ఖచ్చితంగా తెలుసుకునేందుకు రక్త నమూనాలను సేకరించి ల్యాబ్‌లకు పంపిస్తున్నారు. ఈ ప్రక్రియ ద్వారా వినియోగదారులతో పాటు గంజాయి ఎక్కడి నుంచి వస్తోంది? దాన్ని ఎవరు సరఫరా చేస్తున్నారు? అనే కీలక సమాచారాన్ని వెలికి తీసి నెట్‌వర్క్‌ను పూర్తిగా ఛేదించాలని పోలీసులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

గంజాయి ముఠా బట్టబయలు
కరీంనగర్ రూరల్ పరిధిలోని గుంటూరుపల్లి–బొమ్మకల్ వద్ద వెహికల్ చెకింగ్ నిర్వహిస్తున్న పోలీసులు, గంజాయి తో ప్రయాణిస్తున్న ముగ్గురిని పట్టుకున్నారు. దుర్శేడ్‌కు చెందిన నేరెళ్ల చరణ్, గోపాల్‌పూర్‌కు చెందిన బెజ్జంకి లోకేష్, మరో మైనర్ బాలుడు కలిసి యమహా మోటార్‌సైకిల్‌పై వస్తుండగా, పోలీసులు కనిపించడంతో పారిపోవడానికి ప్రయత్నించారు. వెంటనే పరిగెత్తి పట్టుకున్న పోలీసులు, వారి వద్ద ఉన్న కవర్‌లో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

చదువులు మధ్యలోనే మానేసిన జల్సాలు
చదువులు మధ్యలోనే మానేసిన ఈ ముగ్గురు, జల్సాలకు అలవాటు పడి గంజాయి కొనుగోలు చేసి కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో అమ్ముతూ కొంతకాలంగా లాభాలు పొందుతున్నట్లు విచారణలో వెల్లడైంది. మరో వ్యక్తి వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేసి మళ్లీ అమ్మేందుకు వెళుతుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి గంజాయి, యమహా మోటార్‌సైకిల్, నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేశారు.

గంజాయి మత్తులో..
కరీంనగర్ రూరల్ ప్రాంతాల్లో యువత గంజాయి కి బానిసై వక్ర మార్గం లో వెళ్లడం.. తీరా ఇటీవల ఓ యువతీ పై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డ సంఘటనలు వెలుగు చూసింది. అంతే కాకుండా జగిత్యాల జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాలలో లోఅమ్మాయి లకు గంజాయి బానిసలను చేసి లైంగికంగా వాడుకున్న గంజాయి బ్యాచ్ పట్టుపడ్డ విషయం తెలిసిందే.

Spread the love

Related News