హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో లక్షకోట్ల రూపాయల అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారని.. ఎక్కడ అవినీతి జరిగిందో ఆధారాలు చూపించాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ అన్నారు. గురువారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. మేడిగడ్డ ప్రాజెక్ట్ ఉపయోగం ఏంటో శుక్రవారంనాడు చూపిస్తామన్నారు. కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదన్నారు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఆనవాళ్లు లేకుండా చేస్తామని మంత్రులు అంటున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ నడిబొడ్డున కట్టిన సచివాలయం, అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చి వేస్తారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి యాత్రలు చేయాల్సింది పోయి తమకు పోటీగా యాత్రలు చేస్తున్నారని కర్నే ప్రభాకర్ విమర్శలు గుప్పించారు.