తెలంగాణ అభివృద్ధికి పాటుపడతాం
గుజరాత్ మోడల్ అభివృద్ధికి ప్రధాని సహకరించాలి
ఇటీవల స్కైవేలు, మెగా టెక్స్‌టైల్ పార్కు మంజూరు చేసినందుకు ప్రధానికి కృతజ్ఞతలు
ఆదిలాబాద్ నుంచి ప్రతిపక్షం ప్రత్యేకప్రతినిధి: కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ పడబోమని, తెలంగాణ అభివృద్ధికి పాటుపడతామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ప్రధాని నరేంద్రమోడీతో కలిసి ఆయన పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. రాజ్యాంగ బద్దంగా ఏర్పడ్డ ప్రభుత్వాలు కలిసి ప్రజల అభ్యున్నతికి పాటు పడాలన్నారు. కేంద్రంతో ఘర్షణ పడితే ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందని, అందుకోసం తాము ఎన్నికప్పుడే రాజకీయంగా భావిస్తున్నామని, ఎన్నికల తర్వాత రాజకీయాలను పక్కనబెట్టి రాష్ట్రాభివృద్ధికోసమే పనిచేయాలని నిర్ణయించి ముందుకు సాగుతున్నామన్నారు.
విభజన హామీ మేరకు ఎన్టీపీసీ 4వేల మెగావాట్లు ఉత్పత్తి చేయాల్సి ఉంటే.. గత ప్రభుత్వ ధోరణితో కేవలం 1,600 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి జరుగుతోందన్నారు.రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్న ప్రధాని మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎన్‌టీపీసీకి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని స్పష్టం చేశారు . మితా 2400 మెగా యూనిట్ల ఏర్పాటుకు తమ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని, అందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఘర్షణ వైఖరి ఉంటే రాష్ట్రాభివృద్ధికి కుంటుపడుతుందని రేవంత్ అన్నారు.
రాజకీయాలు కేవలం ఎన్నికల సమయంలోనే చేయాలని అన్నారు. అలాగే హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలను దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో రక్షణ సంస్థకు చెందిన దాదాపు 190 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ‘దేశం 5 ట్రిలియన్ ఆర్థికవ్యవస్థ చేరడంలో హైదరాబాద్ కీలకపాత్ర పోషిస్తుంది. దేశవ్యాప్తంగా మెట్రో నగరాల అభివృద్ధిలో భాగంగా భాగ్యనగరానికి కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. గుజరాత్లో నర్మదా నది సుందరీకరణ చేశారని, హైదరాబాద్లో మూసీ రివర్ అభివృద్ధికి కేంద్రం సహకరించాలని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీని కోరారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి పెద్దన్నలా ప్రధాని మోదీ సహకరించాలి.’ అని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు.
అలాగే టెక్స్‌టైల్ రంగంలోనూ భారీగా నిధులు కేటాయించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధి ప్రధాని మోదీ పెద్దన్నలా సహకరించాలని కోరారు.. సీఎం రేవంత్‌రెడ్డి. ఆదిలాబాద్ జిల్లాకు సాగునీటిని అందించేందుకు తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సహకరించాలని రేవంత్కోరారు ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి 250 ఎకరాల భూమి ఇచ్చేందుకు ఒప్పించాలని విజ్ఞప్తి చేశారు. భూ పరిహారాన్ని తమ ప్రభుత్వం చెల్లిస్తుందని రేవంత్ స్పష్టం చేశారు.