ఇంగ్లండ్ ‘బజ్‌బాల్’ను టీమిండియా చితక్కొట్టింది. ఏకంగా 434 పరుగుల తేడాతో స్టోక్స్ బృందాన్ని ఓడించి రాజ్‌కోట్‌లో రాజసం చిందించింది. ఫలితంగా కనీవినీ ఎరుగని రీతిలో ఇంగ్లిష్ జట్టు ఘోర ఓటమిని చవిచూసింది. తమ క్రికెట్ చరిత్రలోనే పరుగుల పరంగా రెండో అతిపెద్ద పరాజయం మూటగట్టుకుంది స్టోక్స్ బృందం. అదే విధంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో వెనుకబడింది. ఈ నేపథ్యంలో దీనిపై ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ స్పందించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘‘బెన్ డకెట్ అద్భుత, అద్వితీయ ఇన్నింగ్స్ ఆడాడు. ఇన్నింగ్స్ ఆసాంతం ఇలాంటి జోరే కొనసాగించాలని మేము భావించాం. టీమిండియా విధించిన లక్ష్యాన్ని ఛేదించాలనుకున్నాం. భారత రెండో ఇన్నింగ్స్‌లో మేము ఎక్కువ సేపు బౌలింగ్ చేయాలని భావించాం. కానీ అలా జరుగలేదు. అనుకున్న దాని కంటే ముందుగానే బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. కొన్నిసార్లు ప్రణాళికలను పక్కాగా అమలు చేయడం సాధ్యం కాదు. ఏదేమైనా మా ఆటగాళ్లకు అండగా నిలవడం ముఖ్యం. ప్రస్తుతం మేము 1-2తో వెనుకబడి ఉన్నాం. అయితే, ఈ మ్యాచ్ నుంచి నేర్చుకున్న పాఠాలతో తిరిగి పుంజుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ ఓటమి నుంచి తేరుకుని తదుపరి రెండు మ్యాచ్‌లపై దృష్టి సారిస్తాం. కచ్చితంగా సిరీస్ గెలిచేందుకు ప్రయత్నిస్తాం’’ అని బెన్ స్టోక్స్ పేర్కొన్నాడు. కాగా మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ ధనాధన్ సెంచరీ(153)తో అలరించాడు. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 4 పరుగులకే రనౌట్ అయ్యాడు. ఇక టీమిండియా- ఇంగ్లండ్ మధ్య రాజ్‌కోట్ టెస్టు నాలుగు రోజుల్లోనే ముగిసిపోగా.. ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 23 నుంచి నాలుగో టెస్టు ఆరంభం కానుంది.